కాళ్లకు చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఎందుకు వస్తాయి?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2013 (17:28 IST)
చాలా మంది కాళ్లు, చేతులకు తిమ్మిర్లుపట్టిందని చెపుతుంటారు. వాస్తవానికి శరీరంలో అనేక భాగాలు ఉండగా కేవలం కాళ్లు, చేతులకు మాత్రమే ఎందుకు తిమ్మిరెక్కుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు తిమ్మిరెందుకు పట్టదు. ఈ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. శరీరంలోని అనేక అవయవాలతో అనుసంధానమై పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. శరీరంలోని ఉదరభాగం, ముఖం, వక్షస్థలం, మెడ, వీపు తదితర భాగాలు పరిసరాల ఒత్తిడికి కానీ, తాకిడికి గురికావు. కానీ మనం ప్రతి పనిలోనూ చేతుల్ని వాడకుండా ఉండలేం. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోనూ కాళ్లు యాంత్రిక ఒత్తిడికి లోనవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే నాడీ తంత్రులు, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ సక్రమంగా జరగదు. ఫలితంగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు చేరవేస్తాయి. దీంతో కాళ్లు తిమ్మిర్లు పట్టిందనే భావన వస్తుంది. ఒత్తిడికి లోనవుతున్న కాళ్లను, చేతులను కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.