సాధారణంగా ఒక వ్యక్తి ఫిట్‌గా ఉన్నారా లేదా అనే విషయాన్ని ఐదు అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
1. దైనందిన జీవితంలో రోజువారీ పనులకు అతని శరీరం ఎంత మొత్తంలో ఆక్సిజన్ వినియోగించుకుంటుంది.
2. ఏదైన పని చేసేటప్పుడు శరీరంలోని కీళ్ళు, కండరాలు ఎంత సమర్థంగా పని చేస్తున్నాయి?
3. బాడీ మాస్ ఇండెక్స్ కొవ్వు శాతం సమతుల్యంలో ఉన్నాయా లేదా, పని చేసే సమయంలో ఎంత మేరకు చురుగ్గా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు?
4. ముఖ్యంగా కీళ్ళు, కండరాలు పట్టేసినట్లుగా కాకుండా ఫ్రీగా ఉన్నాయా లేదా?
5. గాయాలను తట్టుకునే సామర్థ్యం ఉందా?
ఇటువంటి భౌతికపరమైన అంశాలు ఫిట్‌నెస్‌కు సంబంధించినవి.
మెదడు చురుకుదనం, శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రత, ఆటలు- ఇండోర్ గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారా లేదా వంటి అంశాలు మానసికంగా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదో అన్నేదాన్ని తెలియజేస్తాయి. వీటిని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు.
ఇకపోతే శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరుగకుండా ఉఛ్వాస నిశ్వాసలు వేగంగా జరగటం, హృదయస్పందన రేటు పెరగటం, కండరాల కదలికలు చురుకుగా ఉంచేందుకు దోహదపడే ఎక్సర్‌సైజెస్‌ను ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ లేదా సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, ఆట్లాడటం, డ్యాన్స్ చేయటం వంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ కిందకు వస్తాయి.
వీటివల్ల వొంట్లో అదనంగా ఉన్న కొవ్వు కరగడంతో పాటు గుండె, ఊపిరితిత్తులు తదితర ప్రధానమైన అవయవాల పనితీరు, సామర్థ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.