Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా స్ఫూర్తిప్రదాత "దుర్గాబాయి"

Advertiesment
బాలప్రపంచం
తన జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా... తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు.

మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయకోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా కీర్తి సాధించిన దుర్గాబాయి జన్మదినం నేడే..!
చాచాజీనే నిలదీసేంత తెగువ..!
  దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్‌ నెహ్రూగారిని టికెట్‌ లేని కారణంగా అనుమతించలేదు...      


1909వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యంనుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు.

స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి... ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు. 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్‌ నెహ్రూగారిని టికెట్‌ లేని కారణంగా అనుమతించలేదు. తదనంతరం టికెట్‌ కొన్నాకనే లోనికి పంపించారు.

గాంధీజీగారి పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి... ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు. స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు.

తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్‌ కమీషన్‌ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్‌వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషిచేశారు.

ఆనాటి ఆర్థికమంత్రి మరియు రిజర్వ్‌బ్యాంకు గవర్నరుగా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్‌ముఖ్‌ను దుర్గాబాయి వివాహం చేసుకొన్నారు. అణగారిన, వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్నతికి ఈమె ఆంధ్ర మహిళా సభను 1937లో స్థాపించారు. ఇందులోని రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.

1943లో దుర్గాబాయి ఆంధ్రమహిళ అనే పేరుతో ఒక మాస పత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దానిపేరు ‘విజయదుర్గ’గా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ప్రచురించారు. ‘లక్ష్మి’ అనే నవల సీరియల్‌గా ప్రచురించారు. చిన్నతనం నుంచీ శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్‌చంద్‌ కథలను తెలుగులోకి అనువదించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. 1971లోనే ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికిగానూ "నెహ్రూ లిటరరీ అవార్డు"ను అందుకున్నారు. అవే గాకుండా.. ప్రపంచశాంతి బహుమతినీ, పాల్‌.జి. హోస్‌మ్యాన్‌ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కాగా... పద్మవిభూషణ్‌ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డులకెక్కారు.

బ్రిటిషు అధికారులచే ‘ఆడసింహం’గా అభివర్ణించబడ్డ ధీరవనితగా, తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి... 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచిఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu