"
తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా..." అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం. భువన భవనపు బావుటా అయి పైకి లేచిన వీరకిశోరం మన అల్లూరి జన్మదినం (జూలై 4) నేడే..! మారుమూల తెలుగు పల్లెలో పుట్టి, మన్యం సీమను కోటగా మలచుకుని... విప్లవాలతో తెలుగు నేలను పునీతం చేసిన సమరయోధుడు అల్లూరి. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా...! |
|
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లొంగిపోవాలని నిశ్చయించుకున్న రామరాజు... 1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు బంధించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆయనను అదే రోజున కాల్చిచంపారు. సాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి... |
|
|
అడవిబిడ్డలైన గిరిజనులను ఏకంచేసి... అడవి, అడవిలోని భూమి, నీరు, సమస్త సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు. ఈయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. పోడు వ్యవసాయానికి పన్ను కట్టక్కర లేదన్నాడు, గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారికి అండదండలుగా ఉన్న బ్రిటీషువారిమీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. అడవన్నలలో పౌరుషాగ్ని రగిలించాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడని రోజుల్లో, భీమవరం తాలూకా కృష్ణా జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. ఈ భీమవరానికి ఆరుమైళ్ల దూరంలో ఉండే మోగల్లులోని పాండ్రంకిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు 1897 జూలై 4వ తేదీన జన్మించారు అల్లూరి సీతారామరాజు.
ఆంగ్లం, సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్న వెంకటరామరాజుకు జాతీయ భావాలు ఎక్కువే. తండ్రి భావాలను పుణికిపుచ్చుకున్న అల్లూరికి, తండ్రి నడిపే ఫొటో స్టుడియోలోని జాతీయ నాయకుల ఫొటోలు, వారి జీవిత విశేషాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి. వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే పసిప్రాయం వీడకపోయినా తండ్రితో సహా అనేక సభల్లో పాల్గొన్నారు.
పెద్దయ్యాక అనేక యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనులు ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన ఆయన వారికి అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చి, దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను నేర్పించి పోరాటానికి సంసిద్ధులను చేశారు.
తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు.
సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘటనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.
ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే అల్లూరి 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయితే విప్లవాన్ని అణచివేసే కార్యక్రమంలో బ్రిటిషు అధికారులు, పోలీసులు ప్రజలను భయకంపితులను చేయటం మొదలుపెట్టారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు అల్లూరి. అయితే 1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు. సాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి... ఈ రకంగా భరతమాత విముక్తి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరవీరుడయ్యారు.