Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొంగళి పురుగు సీతాకోక చిలుకగా...!

Advertiesment
గొంగళి పురుగు సీతాకోక చిలుక ప్యూపా దశ తల ఉత్పత్తి
, మంగళవారం, 22 జులై 2008 (13:58 IST)
FileFILE
రకరకాల రంగులతో చూడ ముచ్చటగా ఎగురుతుండే సీతాకోక చిలుకలంటే అందరికీ ఇష్టమే. ఇంత అందంగా ఉన్న ఇవి నల్లగా, పొడవైన వెంట్రుకలతో ఉండే గొంగళి పురుగులంటే నమ్మబుద్ది కాదు. కానీ అదే నిజం. కాబట్టి, గొంగళి పురుగులు సీతాకోక చిలుకలుగా ఎలా మారుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సీతాకోకచిలుకగా మారడానికి ముందుగా గొంగళిపురుగు ప్యూపా దశకు చేరుకుంటుంది. ప్యూపా దశ అంటే... గొంగళిపురుగు ఏదేని చెట్టు లేదా మొక్కలోని అనువైన ఆకుకాండాన్ని ఎంచుకుని తలను కిందికి తిప్పి, శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకుంటుంది. తల కింద భాగం నుండి అతి సన్నని పట్టుదారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి, వాటితో చిన్న దిండులాగా చేసుకుని దాని ఆధారంగా అది కాండానికి అతుక్కుపోతుంది.
సీతాకోక చిలుక రకాలు
  భారత దేశంలో సుమారు 1443 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారత దేశంలోనే మొత్తం 315 రకాల సీతాకోక చిలుకలున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అతి పెద్ద సీతాకోక చిలుక...అట్లస్‌ అటతస్‌.      


గొంగళి పురుగు తనచుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ, తలను అటూ ఇటూ కదిలిస్తూ... దారాల్లాంటి పోగులతో దేహం చుట్టూ ఒడ్డాణాన్ని రూపొందించుకుంటుంది. కొద్ది రోజులు గడిచాక దాని చర్మం లోపల మరో సున్నితమైన చర్మపు పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో అది తన శక్తినంతా ఉపయోగించి గింజుకోవడంతో పై చర్మం చీలి విడిపోతుంది. దాంతో లోపల ఉన్న కొత్త చర్మం పైకి తేలి వాతావరణంలోని గాలి సోకి గట్టిపడుతుంది. దీనినే ప్యూపా దశ అంటారు.

ప్యూపా తన తోక చివరన ఉన్న కొక్కీలను గొంగళి పురుగుగా ఉన్నప్పుడు తయారు చేసుకున్న దిండుకు తగిలించగా, చర్మం లోపల ఉత్పన్నమయ్యే హార్మోన్ల వల్ల చాలా మార్పులు కలుగుతాయి. పూర్తిగా పరివర్తన చెందిన తరువాత తనలో ఉత్పన్నమైన ద్రవాలను తలతో పాటు శరీరమంతా ప్రసరింపజేస్తుంది. దాంతో కొత్తగా ఏర్పడిన పై చర్మం కూడా చీలిపోయి విడిపోతుంది. అయితే, ఈ చర్మం విడిపోయేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది.

చర్మం ఏర్పడిన తరువాత నెమ్మదిగా గాలి పీలుస్తూ... తల, తలపైని స్పర్శ శృంగం, తలలోని నోరు మొదలైన చిన్న భాగాలతో పురుగు రూపంలో బయటకు వచ్చి ఆకుకు అంటుకుపోయి స్వేచ్చగా వేలాడుతుంది. మెత్తని దాని శరీర భాగాలు మెల్లగా పెరగడం ప్రారంభమవుతాయి.

అలాగే... రెక్కలలోనికి రక్తం ప్రసరించి, అవి నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. ఆ తరువాత హార్మోన్ల ప్రభావంతో రెక్కలలో అనేక రంగులు ఏర్పడి, తడి లేకుండా బాగా విప్పారి గట్టిపడుతాయి. ఇలా పై దశలన్నీ ముగిసిన తరువాత గొంగళి పురుగు పూర్తిగా సీతాకోక చిలుకగా మారుతుంది.

ఈ సీతాకోక చిలుక తన సున్నితమైన, అందమైన రెక్కలను మొదట్లో నిదానంగా ముడుస్తూ... తెరుస్తూ... కొంత అలవాటు పడిన తరువాత పైకి ఎగిరేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటిదాకా అది పట్టుకుని వేలాడుతున్న ఆకు నుండి విడివడి ఆహారం కోసం ఇతర చెట్లపైకి, పూవులపైకి ఎగురుతుంది.

Share this Story:

Follow Webdunia telugu