Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

71వ స్వాతంత్ర్య దినోత్సవం... తెలుగుబిడ్డ అమరవీరుడు అల్లూరి....

స్వాతంత్ర్య సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు చేసిన విప్లవోద్యమం బ్రిటీష్ తెల్లదొరలను గడగడలాడించింది. మన్యం వీరునిగా బ్రిటీష్ వారిని ఒంటిచేత్తో వణికించిన అల్లూరిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుర్తుచేసుకుందాం. తుపాకులకు బెదరని, చావంటే భయం లేని సాహస

71వ స్వాతంత్ర్య దినోత్సవం... తెలుగుబిడ్డ అమరవీరుడు అల్లూరి....
, గురువారం, 10 ఆగస్టు 2017 (22:35 IST)
స్వాతంత్ర్య సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు చేసిన విప్లవోద్యమం బ్రిటీష్ తెల్లదొరలను గడగడలాడించింది. మన్యం వీరునిగా బ్రిటీష్ వారిని ఒంటిచేత్తో వణికించిన అల్లూరిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుర్తుచేసుకుందాం. తుపాకులకు బెదరని, చావంటే భయం లేని సాహసి అల్లూరి.
 
అగ్గిపిడుగు అల్లూరి స్వతంత్ర సంగ్రామంలో ఎదురొడ్డి పోరాడుతూ ఓ రోజు బ్రిటీష్ సైన్యానికి చిక్కాడు. మేజర్ గుడాల్ తుపాకీ అల్లూరిపై గురిపెట్టాడు. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అల్లూరి పాదంలో దిగింది. ఆ తూటాను రామరాజు చూడలేదు. ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని కూడా పట్టించుకోలేదు. బాధను లెక్కచేయకుండా గుడాల్‌నే చూస్తూ గంభీరంగా 'వందేమాతరం' అంటూ పలుకుతూనే ఉన్నాడు. గుడాల్ నిర్విరామంగా రామరాజును కాల్చుతూనే ఉన్నాడు. 
 
మోకాళ్ళు దాటిన తూటాల గాయాలు తొడలను తొలుచుకుంటూ వెళ్ళసాగాయి. గుడాల్‌కు తనివితీరలేదు. కోపాగ్ని చల్లారలేదు. నరరూప రాక్షసునిగా గుడాల్ వ్యవహరించసాగాడు. రామరాజు శరీరం అంతా చిన్నాభిన్నమయింది. గుడాల్ తుపాకి రామరాజు నాభికి అభిముఖంగా గురి పెట్టబడి ఉంది. ట్రిగ్గర్ మీద వేలు నొక్కేందుకు సిద్ధంగా వుంది.
 
రామరాజు గొంతు ఖంగుమంది. 'గుడాల్.. చంపదల్చుకుంటే, ఇదుగో యిక్కడ కాల్చు' అని గుండెను చూపాడు రామరాజు. గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుండి పైకి గురి పెట్టబడింది. చేతిలోని తుపాకీ పేలింది. అగ్ని గోళంలాంటీ తూటా వెలువడింది. రామరాజు గుండెను చీల్చుకొని పోయింది. రామరాజు ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. విప్లవవీరుని తల ఒరిగిపోయింది. 
 
"విప్లవం నా జన్మహక్కు" అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు అల్లూరి సీతారామరాజు. గురి తప్పిన అధికారికి గుండెలు చూపి కాల్చమన్న వీరాధి వీరుడు రామరాజు. 27 సంవత్సరాల వయసులోనే దేశంకోసం ప్రాణాలర్పించిన రామరాజు చరిత్ర అమరచరిత్రగా నిలిచిపోతుంది. భారత స్వాతంత్రోద్యమం చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు మహోజ్వల ఘట్టం. తెలుగు బిడ్డ అల్లూరికి జోహార్....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుకు ఉరిశిక్ష వేయాలంటున్న జగన్... ఓటరు ఫోటో తీస్తామంటున్న ఈసీ... ఏంటీ హీట్?