Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షయం కాని ఫలితాలనిచ్చే అక్షయ తృతీయ.. బంగారమే కాదు ఏదైనా కొనవచ్చు..

అక్షయ తృతీయ నాడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు శ్రీమహావిష్ణువుకు అపారమైన భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తే చాలు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ప్రతీది ఆయన సతీమణి అయిన మహాలక్ష్మీ దేవికి కూడా ప్రీతి

Advertiesment
Akshaya Tritiya 2017
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:58 IST)
అక్షయ తృతీయ నాడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు శ్రీమహావిష్ణువుకు అపారమైన భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తే చాలు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ప్రతీది ఆయన సతీమణి అయిన మహాలక్ష్మీ దేవికి కూడా ప్రీతికరమే. శ్రీ మహావిష్ణువు పరుశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున (అక్షయ తృతీయ) ఏం చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని విశ్వాసం. 
 
అందుకే అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, పుణ్య కార్యాలు, ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలెత్తినా అలాగే వుంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున పూజ, జపం, దానం చేయాలి. ఈ పుణ్యపలం జన్మజన్మలకూ తోడు నిలుస్తుంది. క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని పండితులు చెప్తున్నారు.
 
అక్షయ తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి, స్నానాదికాలు ముగించుకుని, అక్షతలను శ్రీ మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసిన తర్వాత 12 మాసాలతో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలం లభిస్తుంది. 
 
కానీ ప్రస్తుతం ప్రజలు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడమే ప్రధానం అనుకుంటున్నారు. అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా అది శాశ్వతంగా ఉండిపోతుందనే మాటను బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనడంలా అర్థం చేసుకుని ప్రజలు పాటిస్తున్నారు. కానీ ఇందుకు అసలైన అర్థం మాటకొస్తే.. అక్షయ తృతీయ రోజున ఎలాంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోవడమే. ఈ రోజున బంగారం కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రజలు అనుకుంటారు. కానీ అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీకి పర్వదినం కావడంతోనే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అందరూ కొంటారు. కానీ ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాకుండా ఏదైనా కొనవచ్చు. 
 
అక్షయ తృతీయ రోజున కృతయుగం ప్రారంభమైందని, అదే రోజున శ్రీ మహా విష్ణువు పరశురాముని అవతారం ఎత్తినట్లు పురాణాలు చెప్తున్నారు. అందుకే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను పండుగలా చేసుకుంటారని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి మట్టితో లేదా వెండితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని మొక్కుకుంటే?