ఐదు కథల "వేదం"..! అబ్బో.. అర్థమవడం కష్టమే..!!
నటీనటులు: అల్లు అర్జున్, మంచు మనోజ్ కుమార్, అనుష్క, మనోజ్ బాజ్‌పాయ్, రాములు, లేఖా వాషింగ్టన్, దీక్షా సేథ్, బ్రహ్మానందం, రఘుబాబు, సత్యం రాజేష్ తదితరులు.నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, సోబూ యార్లగడ్డ, దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి ( క్రిష్), సంస్థ: ఆర్కా మీడియా వర్క్‌పాయింట్: మనిషి మనిషిగా జీవించాలని చెప్పే వేదం సృష్టికి మూలాలు తెలుసుకోవాలంటే వేదం తెలియాలంటారు. మనిషి ఎలా బతకాలో.. అసలెందుకు బతుకుతున్నాడో జీవితానికి అర్థం ఏమిటో వేదాల్లోనే తెలుస్తాయని నానుడి. అలాంటి వేదం పేరును టైటిల్‌గా ఎంచుకుని మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఐదు కథల ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసాడు. మొదటి భాగమంతా ఆ ఐదు కథల గమ్యం ఎటువైపు పోతుందో అర్థం చేసుకునేలోపే ఇంటర్వెల్ పడుతుంది. మిగిలిన సగభాగం అందరూ ఒకేచోట కలవడంతో సినిమా ముగుస్తుంది. మామూలు సినిమాకు ఇది భిన్నమైన కథ. హీరో హీరోయిన్ల లవ్, యాక్షన్, ఫైట్లు రొటీన్ సినిమాలో ఉండేవే అయినా కొత్త ప్రయోగంగా అనిపించింది. మంచు మనోజ్, అల్లు అర్జున్‌లు నటిస్తున్నారనగానే మల్టీస్టారర్ అనే ఆరంభంలో ఇద్దరూ చెప్పారు. కానీ ఈ చిత్రం టైటిల్‌లో మంచు మనోజ్‌కు మాత్రం గెస్ట్ అప్పీయరియన్స్ అని వేయడం విశేషం.కథగా చెప్పాలంటే... పాప్ స్టార్ కావడానికి ప్రయత్నాలు చేసే వివేక్(మంచు మనోజ్) తన గోల్ రీచ్ కావడానికి తన ట్రూప్‌తో హైదరాబాద్ వ్యాన్‌లో బయలుదేరుతాడు. అమలాపురంలో ఉండే సరోజ(అనుష్క) వేశ్య. ఐదువేలకు తన శరీరాన్ని పంచడానికి సిద్ధపడే సరోజ ఆ కూపం నుంచి బయటపడి తనే స్వంతగా కంపెనీ పెట్టడానికి ఓ మనిషి సాయంతో సిటీకి రైల్లో బయలుదేరుతుంది. తను తీసుకున్న అప్పులో అసలు తీర్చినా వడ్డీకోసం తన మనవడినే ఎత్తుకెళ్లిన పటేల్ నుంచి పిల్లాడ్ని కాపాడుకోవడం కోసం కిడ్నీని సైతం అమ్మాలనుకునే సిరిసిల్ల చేనేత కార్మికుడు, ఓ బ్రోకర్ ద్వారా హైదరాబాద్ పయనమవుతాడు. ఓల్డ్ సిటీలో ఉన్న పాపానికి ముస్లిం అయిన ఖురేషి(మనోజ్ బాజ్‌పాయ్)ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేయడం, దాన్నుంచి బయటపడి సౌదీ వెళ్లాలనుకునే టైమ్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. ఇక జూబ్లిహిల్స్‌లోని స్లమ్ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ రాజా(అల్లు అర్జున్) తన స్థాయిని మించి 400 కోట్ల వారసురాలైన యువతిని కోటీశ్వరునిగా నమ్మించి ప్రేమిస్తాడు. డిసెంబర్ 31 రాత్రి పార్టీకి హాజరయితే తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని హీరోయిన్ చెప్పడంతో అందుకు రెండు టిక్కెట్లు కొనాలంటే 40వేలు కావాలి. దానికోసం ఎన్నో తిప్పలు పడతాడు. వీరి పరిచయంతోనే ఇంటర్వెల్ వస్తుంది. ఆ తర్వాత వీరంతా ఒకే చోట కలుస్తారు. ఎవరికివారు తమ గమ్యంకోసం సాగే జీవన పోరాటంలో కొన్ని అడ్డంకులతో సిటీలోని పెద్దాసుపత్రిలో చేరతారు. ఒకరికొకరు తెలీదు. కానీ అక్కడ ఉగ్రవాద ముఠా ఆసుపత్రిని పేల్చడానికి పన్నిన కుట్రలో వీరంతా ఒకరికొకరు రక్షించుకోవాలనే తాపత్రయంలో మిగిలిన వారిని రక్షిస్తూ, తమను తాము రక్షించుకునే క్రమంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రాణాలు పోగొట్టుకుంటారు. క్లుప్తంగా ఇదీ కథ. ఈ ఐదుగురు జీవన గమ్యంలో కొంత ఎంటర్‌టైన్మెంట్, కొంత సెంటిమెంట్, కొంత యాక్షన్, కొంత శృంగారం కలిపి ఉంటాయి.ఇద్దరు హీరోలు ఈ కథలో నటించడం గొప్ప విషయం. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ఉన్న ఈ కథ గతంలో వచ్చిన ఓం శాంతి ఓం తరహాలో ఉన్నా... హీరో ఇమేజ్‌తో ఏదో చూపిస్తాడనే ఆశతో వచ్చిన ప్రేక్షకులకు కాస్త నిరాశే మిగులుతుంది. అల్లు అర్జున్ కేబుల్ రాజాగా సూటయ్యాడు. కోటీశ్వరాలైన అమ్మాయిని బుట్టలో వేసి ఆమె ప్రాపకం పొందే క్రమంలో అతడు చేసే పనులు కాస్త నవ్వు పుట్టిస్తాయి. 40
వేల కోసం అతడు పడే తిప్పలు కూడా ఎంటర్‌టైన్ చేస్తాయి. డబ్బుకోసం మనిషి దేనికైనా తెగిస్తాడనీ, ఆ తర్వాత తను చేసింది తప్పని తెలుసుకుని పశ్చాత్తాప పడే సందర్భం గుండెలు పిండుతుంది. కిడ్నీ అమ్మి తన మనవడ్ని చదివించుకోవాలన్న కోరికతో ఉన్న చేనేత కార్మికుడిని సైతం లెక్క చేయకుండా డబ్బు దొంగిలించే సన్నివేశం నుంచి సినిమా ముగింపు వరకూ సెంటిమెంట్ బాగానే పండింది. ఇక మంచు మనోజ్ తండ్రి, తాతల్లా దేశానికి సేవ చేస్తూ అశువులు బాసినట్లు కాకుండా తనకంటూ ప్రత్యేకతకోసం పాప్‌స్టార్ కావాలనుకుంటాడు. అటువంటి వ్యక్తి గమ్యంలో ఎదురైన అనుభవాలు, చివరికి దేశంకోసం చేసిన త్యాగం బాగానే ఉంది. వేశ్య పాత్రలో అనుష్క నటించింది. ఆమె ఏదో చూపిస్తుంది అనుకుని వచ్చే మాస్ ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. వేశ్యా వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి... వారి జీవితాలు కర్పూరంలా ఎలా ఆరిపోతున్నాయనేది ఆమె పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. మంచిగా బతకాలనుకునే ముస్లింను టెర్రరిస్టు ముద్ర వేసే సన్నివేశాలు బాగున్నాయి. చివరికి ఆ ముస్లిమే తన జీవితానికి బ్రేక్ వేసిన ఎస్ఐ ప్రాణాలను కాపాడే సన్నివేశం సెంటిమెంట్ పరంగా తాకింది. ఈ ఐదు కథల్లో చెప్పేది ఒక్కటే... మనిషిలో మానవత్వం ఉండాలి. డబ్బే ప్రధానం కాదనేది. అందుకే రూపాయి పాటను కీరవాణి రాసి స్వరపర్చిన పాట సందర్భానుసారంగా ఉంది. వేశ్య పాత్రలో అనుష్కపై తీసిన పాటలో అచ్చమైన తోలుతిత్తి.. గుమ్మాలు తొమ్మిది అంటూ నవరంధ్రాలను తెలియజేస్తూ ఆ పాటను రాసిన ప్రయోగం సూటయింది. ఇక మాటలపరంగా పొందికగా కొన్ని హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. వేశ్యమాత వేశ్యల్ని పిండి బతుకుతుంటే.. తననూ పోలీసులు, రాజకీయ నాయకులు పిండి వసూలు చేస్తారనే సందర్భం సరిపోయింది. సినిమా వాళ్లను, వేశ్యల్ని ఆసక్తిగా చూస్తారనే పోలిక నవ్వు తెప్పిస్తుంది. అయితే కొన్ని నిజాలున్నాయి. వేశ్య బట్టలు ఊడదీసి ఒళ్లు అమ్ముకుంటే.. పోలీసు బట్టల్తోనే అమ్ముకుంటారనే ఘాటు విమర్శ మహా ఘాటుగానే ఉంది. అన్ని రంగాల్లో అనుభవం ఉంటేనే జీతం ఎక్కువ. కానీ వేశ్యలకు అనుభవం లేకపోతే డబ్బులు ఎక్కువ... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.కీరవాణి సంగీతం ఫర్వాలేదు. ఆయనే రాసిన రూపాయి పాట పాడారు. దర్శకుడు క్రిష్ ఓ సందర్భంలో సన్యాసి గెటప్‌లో కన్పించి తన కోరిక తీర్చుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా చెప్పేదేమంటే... రఘుబాబు ఓ సందర్భంలో..."నేను డప్పు బాగా వాయిస్తానని కె. రాఘవేంద్రరావు అన్నమయ్యలో నాకు పిలిచి అవకాశం ఇవ్వడు. మనం ఎక్కడ నుంచి వచ్చాం. మన తాహతు ఏమిటో తెలుసుకోవాల"ని అంటాడు. సినిమాలో ఇదే నీతి. ప్రతి మనిషి ఒక్క క్షణం ఆలోచించి మనిషిగా జీవిస్తే.. జీవించనిస్తే... అదే వేదం. అంటూ ముగింపు పలుకుతాడు దర్శకుడు. వాణిజ్యాంశాలున్నా ఇది అందరికీ నచ్చే చిత్రమవడం కాస్త కష్టమే.