తెలుగు చలనచిత్ర రంగంలో 24 క్రాప్ట్‌లకు చెందిన వారినందరినీ ఒకే తాటిపై తెర్చేందుకు పలువురు కృషి చేస్తున్నారు. పేద కళాకారులందరికీ, టెక్నీషియన్స్‌కు నానక్‌రామ్‌గూడాకు వెళ్ళే దారిలో కొండ ప్రాతంలో చిత్రపురి కాలనీ పేరుతో సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూమ్‌లు కట్టడానికి కమిటీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంది.
దశాబ్దాల నాటి కల నేడు నిజమవుతుందని కార్మికులంతా అనుకున్నారు. ప్రస్తుతం 11 మంది సభ్యులు గల కమిటీ బాధ్యతలు నిర్వహిస్తోంది. అటు పక్కనే లగడపాటి రాజగోపాల్ భారీ నిర్మాణాలు ఉండటంతో చిత్రపురికి మంచి డిమాండ్ వచ్చింది. కానీ దీనిని సాకుగా తీసుకుని కమిటీ సభ్యుల్లో కొందరు అవినీతికి పాల్పడ్డారని ఎపీ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ. కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అది గత కొద్దిరోజులుగా చర్చనీయాంశమైంది.
అసలు కార్మికులందరినీ న్యాయం చేయాలని దాసరి నారాయణరావు నేతృత్వంలో గత కొన్నేళ్లుగా కృషి జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలోనే కాలనీ శంకుస్థాపనకు రంగం సిద్ధం చేశారు. కానీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రెండు రోజుల్లో రాబోతున్నారనగా అకాలమరణం చెందారు. ఆ తర్వాత రోశయ్యతో శంకుస్థాపన చేయించారు. ఆ కార్యక్రమానికి గీతారెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
అప్పటివరకు ఈ కాలనీపై పెద్దగా ఆసక్తిలేని వారు.. ప్రారంభోత్సవానికి హాజరయ్యాక అక్కడి వాతావరణం చూసి కొందరిలో గుబులు పుట్టింది. దాని ఫలితమే సినీ కార్మికులు కాని వారు కూడా మెంబర్లుగా చేరిపోయారు. ఇదంతా గప్‌చిప్‌గా జరిగిపోయింది.
ఈ విషయం ఈ నెల 14జరిగిన కమిటీ ఎన్నికల్లో బయటపడింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పేరున్న ప్రముఖులు ఎవరూ రాకపోవడంతో పాటు వచ్చిన వారిలో 70శాతం మంది కొత్తవారే కావడం గమనార్హం. ఇంకా వాళ్లంతా కారుల్లో ఎక్కువగా రావడంతో అక్కడివారు ఆశ్చర్యపోయారు. 67 ఎకరాల ఆ స్థలాన్ని పాతకళాకారులకు కేటాయించాలి. ఈ విషయంలో ఆ రోజు పోటీలో పాల్గొన్న మరికొంతమంది సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చారు.
కానీ అంతకుముందురోజు దాసరి నారాయణరావు ఫోటోతో సి.కళ్యాణ్ పత్రికా ప్రకటన చేశారు. కార్మికులంతా ఇప్పటి ప్యానల్‌లోనే కంటెన్యూ చేయమని అప్పుడే ఇంటి కల నెరవేరుతుందన్నారు. దీని కోసం రూ. 2,60,000 రూపాయలు కేటాయించారు. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి. అనేది ప్రశ్న. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా సాగుతోంది.
ఇంకా 2300 మంది సభ్యులు సినిమా రంగానికి సంబంధం లేనివారు ఉన్నారని సొసైటీ మాజీ సెక్రటరీ ప్రకటించడంతో సమస్య మరింత జఠిలమైంది. జనరల్ బాడీలో అంతకుముందు సభ్యత్వం కలిగినవారు సింగిల్ బెడ్‌రూమ్‌కు, డబుల్ బెడ్‌రూమ్‌కు రూ.1,20,000 కట్టాలని నోటీసులు పంపారు. చాలామంది పేదవారు ఈ మొత్తాన్ని కట్టలేకపోయారు. దీన్ని ఆసరాగా తీసుకుని కమిటీ బయటి వ్యక్తులకు అమ్మేసింది. దీన్ని తాను నిరూపిస్తానని ఓ.కళ్యాణ్ ప్రకటించారు. ముంబైలో ఆదర్శ హౌసింగ్ లాగా చిత్రపురి కాలనీలో బినామీ పేర్లతో నిండిపోయిందని, దాన్ని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయన అభిప్రాయానికి పలు కార్మికులు మద్దతు పలికారు.
వీరి డిమాండ్‌ల సంగతికి వస్తే..!
సొసైటీక్ ప్రభుత్వ పెద్దలు, పరిశ్రమ పెద్దలు, మీడియా సమక్షంలో సొసైటీలో నమోదైన ప్రతి సభ్యుడిని వ్యక్తిగతంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు కట్టలేదని తీసేసిన 1551 మంది సభ్యులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరగకపోతే.. చిత్రపురి అచిత్రపురిగా మారిపోతుందని వాపోతున్నారు.
డిసెంబర్‌లోగా ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని, లేనట్లైతే గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆమరణ నిరహారాదీక్షలు చేపడుతామని, కార్మికులు పాల్గొనకుండా సినిమా షూటింగ్‌లు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారో వేచి చూడాలి.