Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో మూణ్ణాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరు?

Advertiesment
Maharashtra
, మంగళవారం, 26 నవంబరు 2019 (19:52 IST)
పలువురు రాజకీయ నేతలు అధికార దాహంతో అడ్డదారులు తొక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానాలు అక్షింతలు వేయడం వల్లో, బలపరీక్షలో విజయం సాధించలేమని భావించి తమ పదవులను నుంచి తప్పుకున్న నేతలు ఎందరో ఉన్నారు. అలా, దేశంలో మూణ్ణాళ్ళ ముఖ్యమంత్రులుగా మిగిలిపోయిన నేతలు అనేక మంది ఉన్నారు. అలాంటి వారు ఎవరో ఓసారి పరిశీలిద్ధాం. 
 
యడ్యూరప్ప (కర్నాటక) : 
గత 2018 సంవత్సరంలో కర్నాటకకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో అతిపెద్ద పార్టీయైన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బలపరీక్ష నిర్వహించగా సరైన సంఖ్య లేక నెగ్గలేదు. దీంతో మూడు రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర) : 
దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్ళపాటు మహారాష్ట్రను పాలించారు. ఆ తర్వాత అంటే ఈ యేడాది అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి సీటు పంపకం విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివసేన తప్పుకుంది.
 
అయితే ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దుతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బలపరీక్షకు సుప్రీం ఆదేశాలు ఇచ్చిన కొద్ది సమయానికే రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 
 
నాదెండ్ల భాస్కర్ రావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) : 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు 1984 ఆగస్టు 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మద్దతుతో ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన 31 రోజులకే అంటే సెప్టెంబర్ 16న రాజీనామా చేశారు. అయితే ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
 
జగదాంబికా పాల్ (ఉత్తరప్రదేశ్) : 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఈయన 1998లో ఎన్నికల అనంతరం ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కొన్ని పార్టీలతో కలిసి బీజేపీ నేత కల్యాణ్ సింగ్ ప్రభత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బలపరీక్షలో ఆయన ఓడిపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన జగదాంబికా పాల్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ నిర్వహించిన బలపరీక్షలో ఓడిపోయి ఆయన రాజీనామా చేశారు.
 
అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఓంప్రకాష్ చైతాలా 6 రోజులు, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ 8 రోజులు, కర్నాటకలో బీఎస్ యడియూరప్ప 8 రోజులు, మేఘాలయ రాష్ట్రంలో ఎస్‌సీ మరాక్ 12 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఇలా పైన పేర్కొన్న నేతలంతా దేశంలో మూణ్ణాళ్ళ ముఖ్యమంత్రులుగా మిగిలిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం : మంత్రి అవంతి శ్రీనివాస్