Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు... ఇప్పటికీ అదే ఉత్సాహం...

Advertiesment
నేడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు... ఇప్పటికీ అదే ఉత్సాహం...
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (09:40 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు తన 71వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. ఆయన 70 యేళ్లు పూర్తి చేసుకుని 71వ యేటలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, పార్టీ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
కాగా, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అలాగే, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన్ రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. 70 యేళ్ల వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 
 
కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీలో కాలేజీ విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు. 
 
ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.
webdunia
 
ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపటట్టం చారిత్రాత్మకం. 
 
1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
webdunia
 
1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. 
 
జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.
webdunia
 
దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపాలు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.
 
ముఖ్యంగా, యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్రను పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. 
 
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి నిరవధిక నిరహారదీక్ష చేశారు.
webdunia
 
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరవధిక దీక్ష చేసి తెలుగు వారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. 
 
దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 208 రోజులు /7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 
 
చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమనిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీలోనూ ఇలా కార్యకర్తలకు అండగా నిలిచిన పార్టీ లేదు.
webdunia
 
జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో మన్మోహన్ - హైదరాబాద్‌లో కేసీఆర్ :: కరోనా పాజిటివ్