Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు... పోలీస్....

నేడు పోలీసు అమర వీరుల దినోత్సవం. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే ప

Advertiesment
Police Martyrs commemoration of the day
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:36 IST)
నేడు పోలీసు అమర వీరుల దినోత్సవం. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.
 
అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా 57 ఏళ్లు.
 
పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. 
 
నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులంటే అటు అధికారులకు, ఇటు సమాజానికి చిన్నచూపే. సమయపాలన లేని విధులు, పైఅధికారులతో తిట్లు, జనంతో ఛీత్కారాలు... ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అన్ని సమస్యలతో విధులు నిర్వర్తిస్తున్నా ఎవరూ గుర్తించడం లేదని చాలామంది పోలీసులు వాపోతున్నారు. పోలీసులకు విశ్రాంతి కావాలనే విషయాన్ని పాలకులు, అధికారులు విస్మరిస్తున్నారు. పోలీసులకు షిప్టు డ్యూటీలు అమలు చేయలంటూ ఉమ్మడి ప్రభుత్వం 2007లో జీవో జారీ చేసింది. తొమ్మిదేళ్ళు గడిచినా ఆ ఊసే లేదు. 
 
ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే పోలీసుల విధులు విభిన్నం. వీరికి పని గంటలతో సంబంధం ఉండదు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతిక్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు అందరినీ పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధుమేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హోంగార్డు, కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణం. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు విరామం లేకుండా పనిచేయాల్సిందే. బందోబస్తు డ్యూటీల్లో పాల్గొనేవారి పరిస్థితి సరేసరి. 
 
సిబ్బంది కొరత కారణంగా సెలవులు మంజూరుకాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రోజూ 40 మంది సిబ్బంది అనారోగ్యంతోనే విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది అనారోగ్యకర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నందున ప్రభుత్వం వారికి అదనపు వేతనం చెల్లిస్తున్నా సరైన ఆరోగ్య పరీక్షలు లేనికారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనందరి బాధ్యత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృగరాజును కంటిచూపుతోనే తరిమికొట్టిన అక్కాచెల్లెళ్లు.. ఎక్కడో తెలుసా?