కన్ఫ్యూజ్లో నల్లారి... ఏ పార్టీ వద్దు బాబోయ్... పవన్ కళ్యాణ్ వద్దన్నారా కిరణ్...?
సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేతల్లో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఒకరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అందులోను దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు
సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేతల్లో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఒకరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అందులోను దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు. అదే కిరణ్‌కు బాగా కలిసొచ్చిన అంశం. వై.ఎస్.ఆర్.తో ఉన్న స్నేహం కాస్త కిరణ్‌కు ఎన్నో పదవులను తెచ్చిపెట్టాయి. చివరకు వైఎస్ మరణం, ఆ తర్వాత రోశయ్య సిఎంగా చేయలేక చేతులెత్తేయడం లాంటి విషయాలు బాగా కలిసొచ్చాయి కిరణ్‌కు. అయితే రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న కిరణ్ ఆ తరువాత సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.
జై సమైక్యాంధ్ర పార్టీతో ప్రజలకు దగ్గరవ్వాలనుకున్న కిరణ్ చతికిల పడిన విషయం తెలిసిందే. అయితే ఇంకేం చేయలేక కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ఇలా ఒకటేమిటి..అన్నీ బాగానే ఉన్నా ఆ తరువాత కిరణ్‌కు పవన్‌పై గాలి మళ్ళింది. కిరణ్ రాయలసీమ బిడ్డ అయినా విద్యాభ్యాసం అంతా తెలంగాణాలోనే. దీంతో అప్పట్లో హైదరాబాద్‌లో ఎన్నో పరిచయాలు కిరణ్‌కు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ కూడా కిరణ్‌కు అదేవిధంగా అప్పట్లో దగ్గరయ్యారు. దీంతో ఆ పార్టీలోకి వెళ్ళేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పవన్ పార్టీలోకి వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దుకున్నాడు. అయితే కొంతమంది నాయకుల సూచనలతో వెనక్కి తగ్గాడు.
ఆ తరువాత జగన్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్థం చేసుకున్నాడు. అక్కడ కూడా ఉండలేమని నిర్ణయించుకుని మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. ఇలా ఒకటి కాదు ఎన్నో విధాలుగా కిరణ్ తికమకపడుతూనే ఉంటాడు. రెండు పడవుల మీద కాళ్లు పెట్టినట్లుగా, ఆలోచన ఒకవిధంగా కిరణ్‌కు ఉండడం లేదు. ఒకే ఒక పడవలో నడిస్తే సరిపోతుంది. కానీ అందుకు విరుద్థంగా ఉన్నాడు కిరణ్. అదే ఇప్పుడు కిరణ్‌కు పెద్ద సమస్యగా మారింది.
ఇంతే కాదు, కిరణ్.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎఐసిసికి కీలక వ్యక్తిగా వెళ్లాలని కూడా భావించారు. బిజెపిలో కేంద్రమంత్రి పదవి కోసం ఆశపడ్డారు. ఇలా ఒకటేమిటి. ఎన్ని జాతీయస్థాయి, స్థానిక పార్టీలున్నాయో అన్నింటికి వెళ్ళడానికి కిరణ్ సిద్థమయ్యారు. కిరణ్ బాటలో నడిచేందుకు సిద్థంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కాస్త నిరాశే మిగులుతోంది. కిరణ్ ఏమీ తేల్చుకోలేక పోతుండడంతో ఆయన అనుచరుల్లో నిరాశ కలుగుతోందని తెలుస్తోంది. విషయం కాస్తా కిరణ్ వరకు వెళ్ళడంతో నిన్న కొంతమంది అనుచరులతో సమావేశమైన కిరణ్ ప్రస్తుతానికి ఏ పార్టీ వద్దు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటాం.. ఆ తరువాత ఎక్కడికి వెళదామో నిర్ణయించుకుందామంటూ తన అనుచరులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. మొత్తం మీద కిరణ్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయన అనుచరులు సతమతమవుతున్నారు.