Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడియో క్యాసెట్ల దుకాణం నుంచి పోయస్ గార్డెన్‌లోకి.. ఇక శశికళకు తోడెవరు..?

వీడియో క్యాసెట్ల దుకాణం నుంచి పోయస్ గార్డెన్‌లోకి.. ఇక శశికళకు తోడెవరు..?
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (16:33 IST)
వీడియో క్యాసెట్ల నుంచి పోయస్ గార్డెన్‌లోకి అడుగుపెట్టిన మహిళ శశికళా నటరాజన్. ఇందుకోసం ఆమె ఏకంగా తన జీవితాని, కుటుంబాన్ని, భర్తను సైతం త్యజించారు. అందుకే అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు ఆప్తమిత్రురాలిగా మారిపోయింది. జయలలిత అధికారంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. చివరకు ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆమె వెన్నంటే ఉంది. 
 
నిజానికి ఈ ప్రపంచంలో ఎవరినీ అస్సలు నమ్మని జయలలిత... నిరంతరం నమ్మిన ఏకైక వ్యక్తి శశికళే కావడం గమనార్హం. మధ్యలో కొన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరమైనా, అనతికాలంలోనే మళ్లీ దగ్గరయ్యారు. వీళ్లిద్దరిది విడదీయలేని బంధం. వాస్తవానికి ఇద్దరూ ఎప్పటినుంచి కలిశారన్న విషయం తెలియదు గానీ, తొలిసారి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1991లోనే. 
 
తిరువారు జిల్లాలోని మన్నార్‌గుడికి చెందిన శశికళ కనీసం పాఠశాల విద్యను కూడా పూర్త చేయలేదు. కుటుంబ పోషణ కోసం వీడియో క్యాసెట్ల దుకాణం నడిపుతూ వచ్చారు. ఈ క్రమంలో నాడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ ప్రచార క్యాసెట్లను శశికళ తీసుకొచ్చి జయలలితకు ఇచ్చేవారు. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కలెక్టర్ చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. అయితే ఒక పట్టాన ఎవరినీ నమ్మని జయలలిత.. ఈ శశికళను మాత్రం ఎలా నమ్మారన్నది ఇప్పటికీ అంతుచిక్కని అంశం. శశికళ సాధారణంగా అవతలి వాళ్లు మాట్లాడుతుంటే మౌనంగా వింటారే తప్ప మధ్యలో కల్పించుకోరు. అలాగే ప్రచారవ్యూహాలు రచించడంలో కూడా దిట్ట అంటారు.
 
1991లో తొలిసారిగా జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత సొంత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్‌ను జయ దత్తత తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయలలిత ముఖ్యమంత్రి పదవిని అధిరోహించలేకపోయారు. అపుడు పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళే. ఎందుకంటే, ఆయన ఈమెకు కూడా వీర విధేయుడు. 
 
ఆ తర్వాత.. 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. అప్పట్లో శశిని సీఎం చేయాలనుకున్నా.. వీలుపడలేదు. తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. పార్టీలో కీలక స్థానం కట్టబెట్టారు. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది. చాలాకాలం ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి. ఇద్దరూ అచ్చం కవలపిల్లల్లాగే కనిపించేవాళ్లు.
 
2011 డిసెంబర్ 19న శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా జయలలిత బయటకు పంపేశారు. కానీ ఆ విభేదాలు ఎన్నాళ్లో లేవు. నాలుగు నెలల్లోపే ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. ఎంతగానంటే.. చివరకు చెన్నై అపోలో ఆస్పత్రిలో వీవీఐపీలు, కేంద్ర మంత్రులు సైతం జయలలిత ఎలా ఉన్నారో చూడలేకపోయినా, శశికళ మాత్రం ఆమె పక్కనే ఉన్నారు. చిట్ట చివరి నిమిషం వరకు సైతం ఆమె తోడుగానే నిలిచారు. ఇప్పుడు జయ లేని లోటును శశికళకు ఎవరు తీరుస్తారో!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు కన్నీటి వీడ్కోలు.. రాజాజీ హాలు నుంచి బీచ్ రోడ్డుకు లాస్ట్ జర్నీ.. అన్నా, ఎంజీఆర్‌ల తర్వాత అమ్మ..!