Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ - పవన్ - లోకేష్ ఎవరి శక్తి ఎంత? ఆంధ్రా యువత ఎటువైపు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీలు యువతరాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. రాజకీయాలకు యువతరాన్ని ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. రాజకీయాలలో ఏదైనా ఒక పార్టీ అధికారం చేపట్టాలంటే అత్యధిక సంఖ్యలో ఉన్న యువతరం ఆ పార్టీకి మద్దతు పలకాల

జగన్ - పవన్ - లోకేష్ ఎవరి శక్తి ఎంత? ఆంధ్రా యువత ఎటువైపు?
, సోమవారం, 14 నవంబరు 2016 (17:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీలు యువతరాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. రాజకీయాలకు యువతరాన్ని ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. రాజకీయాలలో ఏదైనా ఒక పార్టీ అధికారం చేపట్టాలంటే అత్యధిక సంఖ్యలో ఉన్న యువతరం ఆ పార్టీకి మద్దతు పలకాలి. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ పైన వ్యతిరేకంగా మీడియాలో ఎన్నో కథనాలు వెలువడినా, అక్కడి యువతరం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపింది. అమెరికాకు వచ్చిన వలసదారుల వల్ల అమెరికన్ యువతరం భవితవ్యం మసకబారిపోయిందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో అమెరికా యువతరానికే ప్రథమ స్థాయి దక్కాలని ఆయన చేసిన ప్రచారం యువతరాన్ని ఆకర్షించింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. రాజకీయ పరిశీలకుల అంచనాలను తారుమారు చేయగల శక్తి యువతరానికే ఉంది.
 
గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో యువతరం అభిమానం పొందిన రాజకీయ పార్టీలే గద్దెనెక్కాయి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యం అక్కడ కె.సి.ఆర్‌కి కలిసివస్తే, విభజనానంతరం రాష్ట్రానికి అనుభవశాలి అయిన నాయకుడు కావాలనే యువతరం భావన చంద్రబాబుకు కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో గెలిచిన తెదేపాకు, ఓడిన వైకాపాకు ఉన్న వ్యత్యాసం కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. విభజనానంతరం రాష్ట్ర విస్తీర్ణం తగ్గిపోవడం, రాష్ట్రంలో నెలకొన్న కుల ప్రాధాన్యత వల్ల రానున్న ఎన్నికల్లోనూ ఏ పార్టీ అధికారం చేపట్టినా విజయం కొద్దీ వ్యత్యాసంతోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు యువతరాన్ని ఆకర్షించే పనిలే నిమగ్నమయ్యాయి.
 
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రలో సభ నిర్వహిస్తే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాయలసీమలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోస్తాలోని మూడు జిల్లాల్లో యువచైతన్యం పేరిట విద్యార్థులతో ముఖాముఖి చేపట్టారు. ముగ్గురు నేతలు.. మూడు ప్రాంతాలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే. యువతను, మరీ ముఖ్యంగా విద్యార్థులను ఆకట్టుకోవడం. జగన్‌ యువభేరి పేరిట ఇటీవలే కర్నూలులో నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో విద్యార్థులను సమీకరించారు. అంతకుముందు తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులలోనూ జగన్‌ సభలు జరిగాయి. టీడీపీకి ముఖ్యమైన జన చైతన్య యాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒక్కరోజే పాల్గొంటుండగా ఆయన తనయుడు లోకేశ్‌ వారానికి మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనల్లో కళాశాలలకే వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. ఆయన గతంలో కూడా కొన్ని కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వరుసలో లేటెస్ట్‌ ఎంట్రీ పవన్‌ కల్యాణ్‌. అనంతపురం సభ తర్వాత రోజు ప్రత్యేకించి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఎవరు ఎప్పుడు మొదలుపెట్టినా విద్యాలయాల బాట ఇక ముందు కూడా కొనసాగనుంది. అన్ని జిల్లాల్లో విద్యాలయాల్లో లేదా బయట వేదికలపై విద్యార్థులతో సభలు నిర్వహించడానికి ఈ నేతలు సన్నద్ధమవుతున్నారు. లోకేశ్‌ యూనివర్సిటీల్లోనూ ముఖాముఖి నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
 
ప్రత్యేక హోదా ప్రధానాంశంగా తీసుకొని జగన్, పవన్ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి లభిస్తుందని జగన్‌ చెబుతుంటే.. ఆ అంశంపైనే ప్రభుత్వంపై విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి రాని ప్రత్యేక హోదా కంటే వచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమని లోకేశ్‌ పేర్కొంటున్నారు. ఇంకా కాపు రిజర్వేషన్‌, రాజధాని-రాయలసీమ వైరుధ్యం తదితర అంశాలను ఎవరి కోణంలో వారు లేవనెత్తుతూ తమ వైఖరికి, వాదనకు అనుగుణంగా విద్యార్థులను, యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన ఉత్తరాంధ్రలో పట్టుకోసం జగన్‌ ప్రయత్నిస్తుండగా, జగన్ సొంత ప్రాంతం రాయలసీమపై పవన్‌ దృష్టి సారించారు. కృష్ణా జిల్లా అల్లుడినంటూ లోకేష్ మధ్య కోస్తాలో యాత్రలకు శ్రీకారం చుట్టారు.
 
రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు 2019 ఎన్నికలకు యువతరాన్నే టార్గెట్‌గా చేసుకొని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయ పార్టీల సభలకు – ర్యాలీలకు – ప్రచార పర్వానికి ఎప్పుడూ ముందుండేది యువకులే. నవతరం ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్‌ మీడియాలో ఉచిత ప్రచారానికి సైతం విద్యార్థులు ఉపయోగపడుతున్నారు. రాష్ట్రంలోని కులాల ఓటింగ్ రాజకీయ పార్టీలకు ఎంత ప్రధానమో, నేడు యువతరం ఓటింగ్ కూడా అంతే ప్రభావితశక్తిగా మారింది. రాష్ట్రంలో లక్షలలో ఉన్న విద్యార్థులు అనే యువతరం సంపదను తమ శక్తిగా, బలంగా మార్చుకోవాలనీ రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ప్రయత్నాలు ఇప్పటి నుండే ముమ్మరం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషులు, మహిళలకు ఒకటే టాయిలెటా? అదీ ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ అందుబాటులోకి తెచ్చిందట..