Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో అతిపెద్ద అభయారణ్యం.. మన నల్లమల

Advertiesment
అభయారణ్యం
, గురువారం, 3 సెప్టెంబరు 2009 (08:01 IST)
File
FILE
రాష్ట్రంలో ఐదు జిల్లాల పరిధిలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం దేశంలోనే అత్యధిక విస్తీర్ణం గల అడవుల్లో ఒకటి. రాయలసీమ జిల్లాలోని కర్నూలు, కోస్తా తీరంలోని గుంటూరు, ప్రకాశం, తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్‌‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఈ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని రాజీవ్‌ అభయారణ్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

దాదాపు 9388.05 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అభయారణ్యం విస్తరించింది. ఇందులో దట్టమైన ప్రాంతం 6664 చ.కి.మీ కాగా, టైగర్ రిజర్వు ప్రాంతంగా 3568.09 చకిమీని ప్రకటించారు. ఈ అటవీ ప్రాంతంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యంగా పేర్కొని, దీన్ని మానవరహిత అటవీ ప్రాంతంగా ప్రకటించారు.

గుండ్ల బ్రహ్మ అరణ్యం 418.30 చకిమీ విస్తీర్ణంలో ఉంది. కాగా, ఐదు జిల్లాల్లో విస్తరించివున్న నల్లమలను నాలుగు డివిజన్‌లుగా విభజించారు. ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లో 1128 చకిమీ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట డివిజన్‌లో 2454 చకిమీ, ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లో 2229 చకిమీ, నాగార్జునసాగర్ డివిజన్‌లో 753 చకిమీ మేర దట్టమైన అడవులుగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, మిగిలిన నాలుగు జిల్లాలో కంటే.. కర్నూలు జిల్లాలోనే ఈ అభయారణ్యం బాగా విస్తరించి వుంది. మూడు దిక్కులుగా నల్లమల అభయారణ్యం ఉంది. జిల్లాలో ఆత్మకూరు, బైర్లూటి, శ్రీశైలం, నంద్యాల, బండి ఆత్మకూరు, తదితర పది అటవీ రేంజ్‌లున్నాయి. ఈ అభయారణ్యం.. నల్లమల మావోయిస్టులకు సేఫ్‌ జోన్‌. నక్సలైట్లకు ప్రధాన స్థావరంగా పేరుంది. కర్నూలు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో నక్సలైట్లు ఎక్కువగా ఉన్నా, కర్నూలు జిల్లా అటవీ ప్రాంతాన్ని వారు షెల్టర్‌ జోన్‌గా ఎంచుకున్నారు.

ఈ ప్రాంతంలో పర్యటించి దారి తప్పించుకున్న వారు.. తిరిగి దారికి చేరుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. దట్టంగా ఆవరించి ఉన్న నల్లమలలో దారులు కనుక్కోవడం దుస్సాధ్యంగానే చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతంలో దోర్నాల నుంచి గుంటూరు, శ్రీశైలం ప్రధాన దారులు మినహాయిస్తే నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు దారులూ బహు అరుదే.

అటవీ ప్రాంతంలో ఎనిమిది వరకు గ్రావెల్‌ రోడ్లు ఉన్నట్టు అధికా రులు పేర్కొంటున్నారు. ఇవి తప్పిస్తే కాలినడక దారులే శరణ్యం. పైపెచ్చు.. ఈ అటవీ ప్రాంతంలో భీకరమైన సూర్య శక్తి ఉన్నప్పుడే చికటిగా ఉంటుంది. సాయంత్రం నాలుగైదు గంటలు అయితే.. ఇక చిమ్మచీకటిని తలపిస్తుంది.

అడవుల్లో 900 అడుగుల ఎత్తులో ఉండే ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు, వాగులు, వంకలు ఇలా ఎన్నో రకాల జల వనరులు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో గుండ్ల బ్రహ్మేశ్వరం, పెచ్చెరువు, అహోబిళం ఫారెస్ట్‌ రేంజ్‌లు అత్యంత అత్యంత ప్రమాదకరమైనవిగా ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu