ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సరైన సమయంలో ఋతువులు రాక వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో సరైన సమయంలో పంటలు పండక రైతులు, ప్రజలు నానా అవస్తలకు గురౌతున్నారు. దీని వలన మనిషి కృత్రిమ వర్షాలపై ఆధారపడుతున్నాడు. ఈ కృత్రిమ వర్షాలు కేవలం మన దేశంలోనే అనుకుంటే పొరపడినట్టే. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై ఆధారపడిన దేశాలు దాదాపు 40దాకా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
భారతదేశంలోకూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కృత్రిమ వర్షాలపై ఆధారపడుతున్నారు. ఈ ఏడాది మహరాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో కృత్రిమ వర్షాలపైనే ఆధారపడి వర్షాలను కురిపించుకుంటున్నారు.
అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది...
కృత్రిమ వర్షాలను క్లౌడ్ సీడింగ్ అంటారు. గాలిలోనున్న మేఘాలనుంచి వర్షాలను కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ క్లౌడ్ సీడింగ్ కార్యక్రమంలో అత్యాధునికమైన విమానం, భూమిపైనున్న రాడార్, ఓ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కొందరు వాతావరణ శాస్త్రజ్ఞులు, పైలెట్లు, ఇతర అధికార, అనధికారులు ఇందులో పాలుపంచుకుంటారు.
భూమిపై కేవలం సంబంధిత అధికారి ఒకరుంటే చాలు. అతను భూమిపైనున్న వాతావరణ పరిస్థితులను విమానంలోనున్న అధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారాన్ని చేరవేస్తుంటే సరిపోతుంది. దీంతో ఆకాశంలో విహరించే శాస్త్రజ్ఞులు మేఘాల పరిస్థితులను అంచనా వేస్తుంటారు.
కృత్రిమ వర్షాలకు ఉపయోగించే విమానం కేవలం ఈ ఒక్క పనికే ఉపయోగిస్తారు. ఈ విమానాలను అమెరికా లేదా ఇజ్రాయెల్ దేశాలనుంచి తెప్పిస్తారు. ఒక సిజన్‌లో మూడు నెలలకు విమానాన్ని తెప్పించేందుకు మరియు రాడార్‌ను ఉపయోగించేందుకు ఖర్చు దాదాపు రూ. 10కోట్లుంటుంది. అయినాకూడా ఈ ప్రయోగంతో మంచి లాభాలే ఉన్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు.
భూమిపై సిల్వర్ అయోడైడ్‌ను కాల్చి దాని కణాలను గాలిలోకి పంపడం జరుగుతుంది. దీంతో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం రెండు సంస్థలు మాత్రమే వీటి సేవలను దేశానికి అందిస్తున్నాయి. అవి సిరి ఏవియేషన్, అగ్ని ఏవియేషన్. వాతావరణంలో వస్తున్న మార్పులకారణంగా ప్రభుత్వాలు పంటలను కాపాడుకునేందుకు కృత్రిమ వర్షాలపై ఆధారపడక తప్పడంలేదు.
ఈ కృత్రిమ వర్షాలు వాతావరణంలో మార్పులను తీసుకువస్తాయి. దీంతో వాయుమండలంలో వివిధ రకాల పదార్థాలను మేఘాలపై ప్రయోగించి వర్షాలను కురిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పదార్థాలను వాయుమండలంలోని మేఘాలలో జొప్పించిన తర్వాత రసాయనిక క్రియలతో మేఘాలలో ఇవి మార్పులు తీసుకు వస్తాయి. దీంతో వర్షాలు కురుస్తాయి. ఇలాంటి ప్రయోగాలలో దాదాపు 25నుంచి 40శాతం వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
భారతదేశంలో కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ 2003వ సంవత్సరంనుంచి ప్రారంభమైంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలలో కృత్రిమ వర్షాలను కురిపించడం ప్రారంభించాయి.
ప్రస్తుత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ముంబై నగర పాలక సంస్థ ఇలాంటి ప్రయత్నం చేసి సఫలీకృతమైంది. అదే విధంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలుకూడా వర్షాభావంతో అతలాకుతలమౌతున్న ప్రాంతాలలో కృత్రిమ వర్షాలను కురిపించే సంస్థలతో సంప్రదింపులు జరిపి కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుత ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు చాలా తక్కువగానే కురిసాయి. రానున్న సంవత్సరాలలో గ్లోబల్ వార్మిగ్ కారణంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కృత్రిమ వర్షాలపై ఆధారపడక తప్పదంటున్నారు వారు.
ఈ ఏడాది కృత్రిమ వర్షాలకొరకు దాదాపు 30నుంచి 35కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే చైనాలో మరింత ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే మన దేశంలో రానున్న ఏడాదికి దాదాపు రూ. 100కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి రావచ్చని విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ప్రొఫెసర్ టీ. శివాజీరావ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఇకపై కృత్రిమ వర్షాలు కురిపించేందుకు దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ముందుకు రానున్నాయి. ఇది ఓ లాభకారి వ్యాపారంగాకూడా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో తొలుత 1994లో దక్షిణభారతదేశంలోని బెంగుళూరులో అగ్ని ఏవియేషన్ కన్సల్‌టెంట్స్ సంస్థ ఏర్పడింది. సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా 2003లో కృత్రిమ వర్షాలను కురిపించింది.