Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరజీవి పొట్టి శ్రీరాములు

Advertiesment
అమరజీవి పొట్టి శ్రీరాములు
, ఆదివారం, 1 నవంబరు 2009 (11:48 IST)
FILE
భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది 50 సంవత్సరాలు నిరంతరం సాగిన ఆందోళనల అనంతరం స్వతంత్ర భారతంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దీని వెనుక చాలామంది మార్గదర్శకులున్నారు. వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఒకరు. ఈ రోజు ఆంధ్రరాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లా (ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు పి. శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. ఆ తరవాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివారు. "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అప్పట్లో అతని జీతం నెలకు రూ. 250లుగా ఉండేది.

అనతికాలంలోనే అతని సంతానం తర్వాత ఆయన శ్రీమతి పరమపదించడంతో పిన్న వయసులోనే అతనికి జీవిత సుఖాలపై విరక్తి కలిగింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. తనకు చెందిన ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సాబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా ఉన్నారు. గాంధీజీతోపాటు దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

గాంధీజీతోపాటు పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు.

1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని వారికి ఆలయంలో ప్రవేశం కల్పించేందుకు కృషి చేశారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.

జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజులపాటు మదరాసు ఇప్పటి చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ప్రత్యేక భాషా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆ అమరజీవికి నివాళులర్పిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu