Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజన్ వర్సెస్ ముఖేష్ : 'గ్రేటర్ కాంగ్రెస్‌'లో ముదిరిన సంక్షోభం!!

Advertiesment
అంజన్ కుమార్ యాదవ్
, బుధవారం, 29 ఫిబ్రవరి 2012 (11:49 IST)
File
FILE
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం రసరంజుగా మారుతోంది. సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు, రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్‌కు మధ్య రాజుకున్న నిప్పు సెగ.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్‌ (జీహెచ్‌సీ)ను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న జీహెచ్‌సీ రాజకీయాలు ఒక్కసారి వీధినపడ్డాయి.

రాష్ట్ర రాజకీయాల్లో కిక్కు లేదని అందువల్ల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు మంత్రి ముఖేష్ గౌడ్ మంగళవారం ప్రకటన చేశారు. దీనిపై సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అగ్గిమీదగుగ్గిలమయ్యారు. తన నియోజకవర్గం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక చేశారు. సికింద్రాబాద్ నీ యబ్బ జాగీరా? అంటూ మంత్రిని నిలదీశారు.

సికింద్రాబాద్‌ స్థానంపై ఎవరైనా.. కన్నేస్తే తన తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. 2004 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏ నాయకుడికీ దమ్ము లేకపోతే తాను పోటీ చేసి, అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై అత్యధిక మెజార్టీతో విజయం సాధించానని ఆయన గుర్తు చేశారు.

అంతటితో శాంతించని అంజన్ కుమర్ యాదవ్.. ముఖేష్‌పై పరుష పదజాలం సైతం ఉపయోగించారు. మగాడివైతే వచ్చే ఎన్నికల్లో గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం మద్దతు లేకుండా గెలిచి చూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. ఏసీ రూముల్లో కూర్చుని కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం కాదని ఆయన మండిపడ్డారు. మంత్రి బాధ్యతారహిత వ్యాఖ్యలపై పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఇకపై... ఇలాంటి నాన్సెన్స్ మాటలు మానుకోవాలని మంత్రికి అంజన్ హితవు పలికారు.

మరోవైపు.. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా మంత్రి మఖేష్ గౌడ్ బుధవారం ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. సికింద్రాబాద్‌ అంజన్ కుమార్ యాదవ్ జాగీరు కాదనీ, అలాగే తన జాగీరు కాదన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే ఎవరైనా అక్కడ నుంచి పోటీ చేయవచ్చంటూ సెలవిచ్చారు. ముఖ్యంగా.. సికింద్రాబాద్ లోక్‌సభ ఓటర్లు ఒక ఎంపీని పదేళ్ళ కంటే మించి ఆదరించలేదని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

పైపెచ్చు.. తన ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానమైన గోషామహాల్‌ను కూడా వదులుకోనని చెప్పారు. ఈ స్థానం నుంచి తన కుమారుడు విక్రమ్ గౌడ్‌ను బరిలోకి దించుతానని రెట్టింపు ధోరణితో ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉన్న సమయంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఓ ఎంపీ, ఓ మంత్రి ఇలా వీధిన పడటం పార్టీకి మంచిది కాదని ఇతర నేతలు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంమీద ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్‌కు, మంత్రి ముఖేష్ గౌడ్‌కు మధ్య ఆది నుంచి ఉన్న విభేదాలు ఇపుడు బయటపడటంతో గ్రేటర్ హైదారాబాద్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఇక ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu