వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
ఆ సమయంలో వచ్చిన భార్య తన భర్త వేరే మహిళతో వుండటాన్ని చూసి ఆ గదికి గడియపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. దీనితో భయపడిపోయిన ఇద్దరూ తమ పరువు పోతుందని బెడ్రూంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూస్తే ఇద్దరూ విగతజీవులై వున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.