Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

Advertiesment
suicide

ఠాగూర్

, శుక్రవారం, 24 జనవరి 2025 (12:43 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విచారణ కోసం పోలీసులు ఠాణాకు తీసుకెళ్లడాన్ని, తమ ఇంటిని సోదా చేయడాన్ని జీర్ణించుకోలేక, అవమాన భారంతో ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలకు ఉరిబిగించి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధిర మండలం నిధానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ ఇంటర్ వరకూ చదివి మెకానిక్ పని నేర్చుకున్నాడు. సూర్యాపేటకు చెందిన మౌలిక(32) అలియాస్ ప్రెజాతో ఫోనులో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీసింది. ఎంటెక్ వరకు చదువుకున్న ఆ యువతి పెద్దలను ఎదిరించి ఆరేళ్ల క్రితం బాజీని వివాహం చేసుకుంది. 
 
పెళ్లయ్యాక ఖమ్మంలో కాపురం పెట్టారు. అన్యోన్యంగా ఉండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు మెహక్ (4), మెసురూల్ (3) ఉన్నారు. మెకానిక్‌గా పనిచేసే బాజీ ద్విచక్ర వాహనాల దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. గతంలో కొన్నిసార్లు విచారణ ఖైదీగా జైలుకు వెళ్లివచ్చాడు. ఐదు నెలల క్రితం సొంత ఊరికి కాపురం మార్చాడు. 
 
ఈ క్రమంలో పాత కేసులకు సంబంధించి బుధవారం సాయంత్రం ఇద్దరు పోలీసులు బాజీని తీసుకెళ్లారు. అతను అపహరించిన ఫోన్ కొన్న వ్యక్తిని తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం మరోసారి వచ్చిన పోలీసులు బాజీ ఇంటిని తనిఖీ చేశారు. బాజీ భార్య లేదా తండ్రి ఖమ్మం రావాలని సూచించారు. ఖమ్మం బయల్దేరేందుకు బాజీ తండ్రి గపూర్ సిద్ధమవుతున్నారు. 
 
ఈ క్రమంలో అద్దె ఇంట్లో ఉంటున్న మౌలిక.. ఇద్దరు కుమార్తెలతో ఇంటి రేకుల కడ్డీలకు ఉరి వేసుకొని ఉండటాన్ని చూసి నిర్ఘాంత పోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. 'బాజీపై గతంలో కేసులున్న మాట వాస్తవమే. ఇప్పుడు సొంత ఊరిలోనే ఉంటూ పని చేసుకుంటున్నాడు. అవమాన భారంతోనే నా కోడలు ఈ దారుణానికి ఒడిగట్టింది' అని బాజీ తండ్రి గపూర్ బోరున విలపిస్తూ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు