ఐదేళ్ళుగా సహజీవనం చేస్తూ వచ్చిన తన ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు.. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ఓ కాలువలో పడేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఈ కేసును మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
థానే జిల్లా పరిధిలోని దేశాయ్ గ్రామ సమీపంలో ఉన్న కాలువ వంతెన కింద సోమవారం ఓ సూట్ కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని దాన్ని తెరిచి చూడగా అందులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలి మణికట్టుపై పీవీఎస్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా మృతురాలిని ప్రియాంక విశ్వకర్మ (22)గా గుర్తించారు. ఆమెతో ఐదేళ్లపాటు సహజీవనం చేస్తున్న వినోద్ శ్రీనివాస్ (50)పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించారు.
ఈ నెల 21వ తేదీ అర్థారత్రి తమ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో ప్రియాంకను గొంతునులిమి హత్య చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక రోజంతా ఇంట్లోనే ఉంచగా, దుర్వాసన రావడంతో 22వ తేదీ రాత్రి సూట్‌కేసులో కుక్కి కాలినడకన వెళ్లి వంతెనపై నుంచి కాలువలో పడేసినట్టు చెప్పారు. నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.