ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అత్యంత విషాదకరంగా మృత్యువడిలోకి చేరుకున్నారు. హ్యూస్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి తీసుకెళ్లింది. ఇక్కడో వార్త గుండెలు పిండేసేలా ఉంది. మరో మూడు రోజుల్లో బర్త్ డే జరుపుకోవాల్సిన ఫిలిప్ బర్త్‌డే అనంతవాయువుల్లో కలిసిపోయాడు. వాస్తవానికి ఈనెల 30వ ఫిలిప్ బర్త్‌డే. దీంతో, హ్యూస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధుమిత్రులు హ్యూస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.
మరోవైపు.. హ్యూస్ విషాదకర మృతి పట్ల సంతపాలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ 25 ఏళ్లకే బాధాకర పరిస్థితుల్లో మృతి చెందడం పట్ల భారత క్రికెట్ జట్టు స్పందించింది. హ్యూస్ మృతికి సంతాపం తెలియజేస్తున్న క్రికెట్ ప్రపంచంతో తాము కూడా జతకూడుతున్నామని తెలిపింది. హ్యూస్ అందరినీ వదిలి వెళ్లిపోయాడని పేర్కొంది. అతని కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా భారత జట్టు మేనేజ్‌మెంట్ ఓ ప్రకటన చేసింది.
అలాగే, ఆసీస్ జాతీయ జట్టు కోచ్ డారెన్ లెహ్మన్, హ్యూస్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. "లిటిల్ చాంప్... అందరం నిన్ను మిస్సవుతున్నాం" అంటూ పేర్కొన్నారు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. 'ఎంత భయంకరమైన వార్త ఇది' అని పేస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. సొంత జట్టు సౌత్ ఆస్ట్రేలియా హ్యూస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది.
ఇక, ఇతర దేశాల క్రికెటర్లు కూడా హ్యూస్ కన్నుమూతపై స్పందించారు. శ్రీలంక క్రికెట్ మూలస్తంభం మహేల జయవర్థనే ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపాడు. ఇప్పుడే ఈ విషాదకర వార్త విన్నామని, అతని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామనీ అన్నాడు. "హార్ట్ బ్రోకెన్" అంటూ దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారథి ఏబీ డివిలీర్స్ ట్వీట్ చేశాడు. అటు, క్రికెట్ వర్గాలే కాకుండా, ఆస్ట్రేలియా రగ్బీ, సాకర్ క్లబ్‌లు కూడా హ్యూస్ మృతికి సంతాపం తెలిపాయి.