"భారతరత్న" ప్రతి ఒక్కరి కల: సచిన్ టెండూల్కర్
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు దక్కాలని ప్రతి ఒక్క భారతీయుడూ కలగంటాడని, అలాంటి కల తనకూ ఉందని భారత పరుగుల యంత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న సచిన్ టెండూల్కర్.. తాజాగా దక్షిణాఫ్రికాతో గ్వాలియర్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా అరుదైన రికార్డు సృష్టించిన మాస్టర్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలని మాజీ క్రికెటర్లు కోరారు.ఈ విషయంపై మాస్టర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అత్యున్నత పురస్కారంగా భావించే భారత రత్న అవార్డు దక్కాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడని, అలాంటి కోరిక తనలోనూ ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టారు. ఇంకా భారత రత్న పురస్కారాన్ని ప్రతి భారతీయుడు గౌరవంగా భావిస్తాడని సచిన్ అన్నారు. కానీ.. భారత రత్న అవార్డును సొంతం చేసుకునేందుకు తనకంటే దిగ్గజాలు ఉన్నారని, అయితే భారత రత్న అవార్డు జాబితాలో స్థానం దక్కాలనే ఆశ తనలోనూ ఉందని సచిన్ తెలిపారు. ఇంకా ఈ అత్యున్నత పురస్కారం తనకు లభిస్తే అరుదైన గౌరవంగా భావిస్తానని మాస్టర్ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతానికి ఆ అవార్డు గురించి ఆలోచించలేదని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు.