మహారాష్ట్రలోని క్రికెట్ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు సుప్రీంకోర్టు కూడా నో చెప్పింది. మే ఒకటో తేదీ తర్వాత అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర వెలుపల నిర్వహించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా చుక్కెదురైంది.
మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో పిచ్‌లను తడిపేందుకు నీళ్లు ఇవ్వబోమని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసిన విషయం విదితమే. ఇదే అశంపై బాంబే హైకోర్టును బీసీసీఐ ఆశ్రయించగా, ఐపీఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐపీఎల్ నిర్వాహకులు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే సుప్రీంకోర్టులోనూ వారికి నిరాశే ఎదురైంది. మే 1 తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు మహారాష్ట్ర బయటే నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మహారాష్ట్రలో ముంబై, పుణె, నాగ్పూర్ వేదికల్లో జరగాల్సిన 13 మ్యాచ్‌లు వేరే రాష్ట్రాల్లోని మైదానాలపై జరగనున్నాయి.