ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరుగనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రేక్షకులకు అనుమతి ఉండడంతో తాము భారత్‌ను ఉత్సాహపరచడానికి భారత ఆర్మీ సిద్ధమైంది. ఇంకా భారత క్రికెట్ కోసం ఓ ప్రత్యేక వీడియోను కూడా రూపొందించింది.
ఈ వీడియోలో భారత్ ఆర్మీ ధరించిన మస్కట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ వీక్షించడానికి సన్నద్ధమవుతున్న భారత ఆర్మీని చూడండి.. అంటూ ఐసీసీ ఈ వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తొలిసారి టెస్టు చాంపియన్‌షిప్ ఆడనున్న టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ భారత్ ఆర్మీ అని రాసి ఉన్న జెర్సీని ధరించి ఉత్సాహపరిచారు.
ఇకపోతే.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉన్నా ఎలాగైనా మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దానికోసం రిజర్వ్ డేలను కూడా ఐసీసీ అట్టిపెట్టుకుంది. ఇక టీమిండియా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌తో ప్రాక్టీస్ చేయగా.. మరోవైపు కివీస్ మాత్రం ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకొని మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. భారత కాలామాన ప్రకారం రేపు సాయంత్రం 3.30 గంటలకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
ఇకపోతే.. ఈ నెల 3న సౌథాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేయగా.. శుభమన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ఇంగ్లాండ్‌తో ఇటీవల రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించుకుని మరో మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకుంది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై కివీస్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.