ఐసీసీ ర్యాంకుల పట్టిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ బూమ్రాలు అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ కూడా టాప్-2లో కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా వన్డే విభాగంలో ర్యాంకులను వెల్లడించింది.
ఆదివారం తాజాగా విడుదల చేసిన జాబితాలో విరాట్ 890 రేటింగ్ పాయింట్లను కూడగట్టుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో 310 పరుగులు చేయడంతో టాప్ ర్యాంక్ మరింత పదిలమైంది. అదే సిరీస్‌లో 202 పరుగులతో సత్తా చాటిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌లో నిలిచాడు.
కివీస్ ఆటగాడు రాస్ టేలర్ మూడో స్థానంలోనూ, క్వింటన్ డికాక్ నాలుగో ర్యాంకులో ఉన్నాడు. భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేదార్ జాదవ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిడియా మరో ఓపెనర్ శిఖర్ ధవన్ 12వ, వికెట్ కీపర్ ధోనీ 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.
ఇకపోతే, బౌలింగ్ విభాగానికి వస్తే, పేసర్ బుమ్రా 774 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ట్రెంట్ బౌల్ట్ 759 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ (747) మూడో ర్యాంక్‌ను సాధించగా, ఇమ్రాన్ తాహీర్ (703) ఏడు స్థానాలు మెరుగుపడి నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
ఆల్‌రౌండర్ జాబితాలో రషీద్ ఖాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. టాప్-5లో టీమ్‌ఇండియా క్రికెటర్లకు చోటు దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ నంబర్‌వన్‌లో ఉండగా, భారత్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్ దశాంశమానం తేడాతో మూడో ర్యాంక్‌ను దక్కించుకోగా, దక్షిణాఫ్రికా నాలుగుకు పరిమితమైంది. ఆస్ట్రేలియా ఐదో ర్యాంక్‌లో ఉంది.