Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పస తగ్గిపోయింది.. కెప్టెన్ సూర్యకుమార్

Advertiesment
indo pak  match

ఠాగూర్

, సోమవారం, 22 సెప్టెంబరు 2025 (10:34 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు, ఆసక్తి ఉండేదని ఇపుడు ఆ ఆత్రుత, ఉత్కంఠ తగ్గిపోయిందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. అందువల్ల ఇకపై దాన్ని రైవర్రీ (పోటీ) అని పిలవడం మానెయ్యాలని ఆయన కోరారు. ఆసియా క్రికెట్ టోర్నీలో భాగంగా, ఇరు జట్లూ ఆదివారం మరోమారు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు. 
 
ఈ మీడియా సమావేశంలో ఒక పాకిస్థానీ సీనియర్ జర్నలిస్టు, రెండు జట్ల మధ్య ప్రమాణాల్లో అంతరం పెరిగిపోయిందా అని ప్రశ్నించారు. దీనికి సూర్యకుమార్ నవ్వుతూ బదులిచ్చాడు. 'సార్, నాదొక విన్నపం. ఇకపై భారత్ - పాకిస్థాన్ మ్యాచ్లను రైవర్రీ అని పిలవడం ఆపేద్దాం' అని అన్నాడు. 
 
జర్నలిస్టు తాను ప్రమాణాల గురించి అడుగుతున్నానని స్పష్టం చేయగా, 'రైవర్రీ అయినా, ప్రమాణాలైనా అన్నీ ఒకటే. రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడితే 8-7 స్కోరు ఉంటే దాన్ని పోటీ అంటారు. ఇక్కడ 12-3 లేదా 13-1 ఉంది. ఇందులో పోటీ ఎక్కడుంది?' అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.
 
ఈ మ్యాచ్ భారత్ అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఆడిందని సూర్యకుమార్ తెలిపాడు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ కేవలం 9.5 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపునకు బలమైన పునాది వేశారని కొనియాడాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన బాధ్యతలను చక్కగా అర్థం చేసుకుంటున్నాడని, ప్రతి గేమ్‌లోనూ మెరుగవుతున్నాడని ప్రశంసించాడు.
 
మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ ఓటమిని అంగీకరించాడు. తాము 15-20 పరుగులు తక్కువ చేశామని, ఈ టోర్నీలో ఇంకా ఒక్క సరైన గేమ్ కూడా ఆడలేదని వ్యాఖ్యానించాడు. భారత ఓపెనర్లను కట్టడి చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని అంగీకరించాడు. అన్ని విభాగాల్లోనూ రాణించి, తర్వాతి మ్యాచ్ శ్రీలంకపై గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ కొత్త అధ్యక్ష పదవి రేసులో తెరపైకి ఊహించని పేరు...