వరల్డ్ కప్‌లోనూ సత్తా చూపిస్తాం: మిథాలీ రాజ్
ప్రపంచ క్రికెట్‌పై హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ముద్ర ప్రత్యేకం. అంతర్జాతీయ క్రికెటర్‌గా 18 ఏళ్ల కెరీర్... దాదాపు 8 వేల పరుగులు... 133 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం... ఇప్పటికీ వన్నె తగ్గని ఆటతో ఆమె తనదైన శైలిలో సత్తా చాటుతోంది. కెప్టెన్‌గా,
ప్రపంచ క్రికెట్‌పై హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ముద్ర ప్రత్యేకం. అంతర్జాతీయ క్రికెటర్‌గా 18 ఏళ్ల కెరీర్... దాదాపు 8 వేల పరుగులు... 133 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం... ఇప్పటికీ వన్నె తగ్గని ఆటతో ఆమె తనదైన శైలిలో సత్తా చాటుతోంది. కెప్టెన్‌గా, అత్యుత్తమ బ్యాట్స్‌విమన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్న మిథాలీ నాయకత్వంలో ఇటీవలే భారత జట్టు వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. టోర్నీలో మూడు అర్ధ సెంచరీలతో ఆమె ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. బుధవారం బీసీసీఐ ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో 34 ఏళ్ల మిథాలీ రాజ్ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా అవార్డును సొంతం చేసుకుంది. మూడోసారి ఈ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో మిథాలీ రాజ్ మీడియాకు వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే విందాం.
వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడకపోవడం వల్ల క్వాలిఫయింగ్‌లో మేం తలపడాల్సి వచ్చింది. అయితే అది బోర్డు నిర్ణయం కాబట్టి మేమేం చేయలేం. మొదటి నుంచి టోర్నీలో మా స్థాయికి తగినట్లు ఆడి ఆధిక్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. అయితే క్వాలిఫయింగ్ టోర్నీ కూడా మంచే చేసింది. యువ క్రీడాకారిణులకు అవకాశమిచ్చేందుకు, వారిని పరీక్షించి అసలు ప్రపంచకప్ కోసం జట్టు కూర్పు గురించి ఒక అవగాహనకు వచ్చేందుకు ఇది ఉపయోగపడింది. మా అంచనాలకు తగినట్లుగా మోనా, దీప్తి, దేవిక, మాన్సి రాణించారు. నేను కూడా వేగంగా పరుగులు చేసేందుకు స్టాన్స్ మార్చి... కొత్తగా ప్రయత్నించి మంచి ఫలితాలు కూడా సాధించాను.
ఉత్కంఠ భరిత ఫైనల్‌లో నిజానికి మేం ఆఖరి బంతి దాకా మ్యాచ్‌ను తీసుకు రాకుండా ఉండాల్సింది! వరుస ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్‌విమన్ అవుట్ కావడం ఒక్కసారిగా దెబ్బ తీసింది. అయితే ప్రధాన ప్లేయర్ హర్మన్‌ప్రీత్ ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాం. అలాంటి స్థితిలో టెయిలెండర్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐదో బంతికి హర్మన్ కొట్టిన సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దురదృష్టవశాత్తూ పాక్‌తో మ్యాచ్‌లో గాయపడటం వల్ల నేను ఫైనల్ ఆడలేకపోయినా, విజయం చాలా ఆనందాన్నిచ్చింది.
ప్రపంచ కప్ కోసం మా సన్నాహాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. స్వదేశంలో విండీస్‌పై సిరీస్ విజయం, ఆసియా కప్, ఇప్పుడు క్వాలిఫయర్స్‌లో జట్టు విజయాలు సాధించింది. ఇప్పుడు నేరుగా ప్రపంచ కప్ బరిలోకే దిగుతాం కాబట్టి ఈ జోరును కొనసాగించడం ముఖ్యం. ఈ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొత్త అమ్మాయిలు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచకప్ కోసం జులన్ గోస్వామి, స్మృతి మంథన తిరిగొస్తారు కాబట్టి టీమ్ ఇంకా పటిష్టంగా మారుతుంది. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయడం, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వచ్చే మూడు నెలలు తీవ్రంగా సాధన చేయాలని పట్టుదలగా ఉన్నాం.