పారిస్ వేదికగా జరుగుతున్న పారాలిపింక్స్ పోటీల్లో భారత స్ప్రింటర్ ఒకరు అదరగొట్టారు. ఆమె పేరు ప్రీతిపాల్. మహిళల 200 మీటర్ల టీ35 కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా రికార్డుకెక్కింది.
అర్థరాత్రి జరిగిన 200 మీటర్ల రేసులో ప్రీతి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 30.01 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగుతో కాంస్యం పతకాన్ని గెలుచుకుంది. చైనా ద్వయం జియా జౌ (28.15 సెకన్లు), గువో కియాన్కియాన్(29.09) వరుసగా స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నారు.
అంతకుముందు శుక్రవారం మహిళల 100మీ టీ35 లోనూ భారత స్ప్రింటర్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల ఆమె ఫైనల్లో 14.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. యూపీకి చెందిన ప్రీతి సోషల్ మీడియాలో పారాలింపిక్ గేమ్స్ క్లిప్లను చూసిన తర్వాత 17 ఏళ్ల వయసులో పారా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన కొన్నేళ్లకు ఆమె తన గురువు, పారాలింపియన్ ఫాతిమా ఖాటూను కలుసుకోవడంతో ప్రీతి జీవితం మారిపోయింది.
కాగా, ఫాతిమా ప్రోత్సాహంతో ప్రీతి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంది. 2023 ఆసియా పారా గేమ్స్ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఇచ్చింది. దాంతో పారిస్ పారాలింపిక్ గేమ్స్క అర్హత పోటీల కోసం ప్రీతి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ గజేందర్ సింగ్ వద్ద శిక్షణ పొందింది. ఆమె కోచ్ సహాయంతో తన రన్నింగ్ టెక్నిక్లలను మెరుగుపరచుకుంది.
ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ప్రీతి తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఆమె 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతకాలను సాధించింది.