భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ఇపుడు ధోనీ ఏం చేయబోతున్నరాన్న అంశంపైనే నెట్టింట తెగ చర్చసాగుతోంది.
క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టు ధోనీ పంద్రాగస్టు రోజైన ఆదివారం రాత్రి 7.29 గంటలకు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, ధోనీ రిటైర్మెంట్ కంటే ముందు తన తదుపరి లక్ష్యం ఏమిటో నిర్ణయించుకున్నారట.
వచ్చే నల 17వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌తో పాటు.. మరె రెండు సీజన్ మ్యాచ్‌లలో ధోనీ ఆడాలని భావిస్తున్నారట. పైగా, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్న విషయమై పక్కా ప్రణాళికలోఉన్నట్టు తెలుస్తోంది. క్రికెట్ కారణంగా ఇంటరుతోనే చదువును ఆపేసిన ధోనీ, దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో, ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచ్‌లర్ డిగ్రీలో చేరిన ధోనీ, ఆరు సెమిస్టర్లలోనూ ఫెయిల్ అయ్యారు. దాన్ని పూర్తి చేయాలని ధోనీ ఆలోచనలో ఉన్నారట.
పదో తరగతిలో 66 శాతం, ఇంటర్ లో 56 శాతం మార్కులు మాత్రమే సాధించానని గతంలో ధోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బోర్డు పరీక్షలను కూడా ఎగ్గొట్టి, క్రికెట్ ఆడేందుకు ధోనీ వెళ్లాడని కూడా అందరికీ తెలిసిందే.
క్రికెట్‌లో రాణించిన తర్వాత, నవంబర్ 2011లో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో గౌరవ ఉద్యోగం లభించింది. ఇప్పటికే ధోనీ పలుమార్లు సైనిక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇవే బాధ్యతలను నెరవేర్చేందుకు తాను సిద్ధంగా ఉంటానని కూడా ధోనీ వ్యాఖ్యానించారు.
ఆర్మీలో పనిచేయాలన్నది తన కలని, దాన్ని నెరవేర్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలోనూ ఆయన చెప్పారు. ఆర్మీలో చేరాలని చిన్నప్పుడే కోరుకున్నానని, ఆ తరువాత క్రికెట్ లో రాణించానని తెలిపారు. దీంతో ఆయన ఆర్మీ విధుల ద్వారా దేశానికి సేవ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.