Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొలంబో వన్డే : 168 రన్స్ తేడాతో శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

కొలంబో వేదికగా గురువారం జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఏకంగా 168 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో శ్రీలంక జట్టు వరుసగా నాలుగో వన్డే మ్యాచ్‌లోనూ

కొలంబో వన్డే : 168 రన్స్ తేడాతో శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (06:59 IST)
కొలంబో వేదికగా గురువారం జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఏకంగా 168 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో శ్రీలంక జట్టు వరుసగా నాలుగో వన్డే మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 375 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 131), రోహిత్ శర్మ (88 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104) శతకాలతో గర్జించారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్‌, రోహిత్ రెండో వికెట్‌కు 219 పరుగుల జోడించారు. మనీష్‌ పాండే (50 నాటౌట్‌), 300వ వన్డే ఆడుతున్న ధోనీ (49 నాటౌట్‌) సత్తా చాటారు.
 
ఆనక భారత బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు 42.4 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూస్‌ (70) టాప్‌ స్కోరర్‌. డిక్‌వెలా (14), మునవీర (11), కుశాల్‌ మెండిస్‌ (1), తిరిమన్నె (18) చేతులెత్తేయడంతో ఛేదనలో 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక ఆరంభంలోనే కష్టాల్లో చిక్కుకుంది. పట్టుదలతో పోరాడిన మాథ్యూస్‌.. సిరివర్దన (39)తో ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించడంతో ఓ దశలో 140/4తో నిలిచిన లంక పోటీ ఇచ్చేలా కనిపించింది. 
 
అయితే, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లంకకు ఓటమి తప్పలేదు. బుమ్రా, హార్దిక్‌, కుల్దీప్‌ తలో రెండేసి వికెట్లు తీయగా.. అరంగేట్రం ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశీ ఆటగాళ్ల తిట్లలో చాలా ఫన్ ఉంటుంది : వీరేంద్ర సెహ్వాగ్