తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్ట్ బస్సు సంజీవిని వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే 108కు ఫోన్ చేయగా గంట తర్వాత రావడంతో రుయా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
అయితే ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే లోపు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అయితే బిడ్డ చనిపోయిన విషయం తెలియక, శవానికి ఒళ్లు పిసికి, బిడ్డ ఒళ్లు నొప్పి తగ్గించే యత్నం చేస్తూ ఆ తండ్రి...అందరినీ కంటతడి పెట్టించాడు.
వివరాల్లో వెళితే.. తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన శేఖర్(32) గత మూడు రోజులుగా ఒళ్లు నొప్పిలు, జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా రుయా ఎమర్జెన్సీకి వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
టెస్టు ఎక్కడ చేస్తారో కూడా తమకు చెప్పేవారు కరవయ్యారని శేఖర్ తండ్రి వాపోయాడు. ఈ క్రమంలో గంటల పాటు వేచి వుండి నీరసంతో కూలిపోయాడని.. చివరికి శాశ్వతంగా కూలిపోయాడని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.