అసలే కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఇపుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ ఒకటి కొత్తగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఫంగస్ దెబ్బకు అనేక మంది కంటి చూపును కోల్పోతున్నట్టు తెలిపారు.
ఈ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి అవుతున్న ఖర్చు కూడా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మూడు వారాల కిందట కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తిలో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించామని సూరత్‌కు చెందిన ఒక ఆసుపత్రి అధిపతి మాథుర్ సవాని చెప్పారు.
'ఇప్పుడు మా ఆసుపత్రిలో ఈ కేసులు సంఖ్య 50కి పెరిగిపోయింది. మరో 60 మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు' అని ఆయన తెలిపారు. ఈ సమస్యతో సూరత్, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి బాధితులు తమ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. వీరంతా కొవిడ్ నుంచి ఇటీవల కోలుకున్నవారేనని తెలిపారు.
బాధితుల్లో ఏడుగురు కంటి చూపును కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూరత్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి కేతన్ నాయక్ చెప్పారు.
మహారాష్ట్రలో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కనీసం 8 మంది దృష్టిని కోల్పోయారని రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరేట్ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. వారు కొవిడ్‌పై విజయం సాధించారు. కానీ వారిలోని బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థపై ఫంగల్ ఇన్‌ఫెక్షన్ దాడి చేసింది అని తెలిపారు.