Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేగుల్లో కరోనా! రక్తం గడ్డకట్టి...నిమ్స్‌లో ఆరుగురి చేరిక!

Advertiesment
corona
విజయవాడ , బుధవారం, 6 అక్టోబరు 2021 (16:02 IST)
కొవిడ్‌ నయమైన అనంతరం బాధితులను రకరకాల వ్యాధుల వేధిస్తున్నాయి. అన్ని అవయవాలపై కరోనా ప్రభావం చూపుతోంది.తాజాగా చిన్నపేగుల్లో కూడా ఇబ్బందులు సృష్టిస్తోందని తేలింది. ఇటీవల రోజుల వ్యవధిలో ఆరుగురు తీవ్ర కడుపునొప్పితో నిమ్స్‌లో చేరారు. వారి చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్‌ (కుళ్లిన స్థితి)గా మారినట్లు వైద్యులు గుర్తించారు.


ఇద్దరిలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పేగులను తొలగించారు. వీరిలో కిడ్నీలు కూడా విఫలమయ్యాయి. డయాలసిస్‌ చేస్తూ...ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, వీరి పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. మరో నలుగురికి కూడా శస్త్రచికిత్స చేసి కొంతమేర పేగు తొలగించామన్నారు. బాధితుల్లో ఇద్దరు మహిళలున్నారు.


అయితే ఈ ఆరుగురికి కొవిడ్‌ సోకినట్లు వారికే తెలియదు. కొవిడ్‌ యాంటీబాడీలు వీరి శరీరంలో ఉన్నట్లు నిమ్స్‌ వైద్యులు గుర్తించారు. ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు టీకా తొలి డోసు తీసుకున్నారు. కొవిడ్‌ అనంతరం వీరిలో ఈ సమస్య వచ్చినట్లు నిర్ధారణకు వచ్చామని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్‌ ఎన్‌.బీరప్ప తెలిపారు. 

 
కొవిడ్‌ సోకిన తర్వాత కొందరిలో రక్తం గడ్డకట్టే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో భాగంగా యాంటికోగలెన్స్‌(రక్తం పలుచన చేసే) మందులను కొన్ని రోజులపాటు వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా ఈ ఆరుగురిలో కొన్ని రోజుల కిందటనే చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టింది. కొవిడ్‌ సోకడంతో ఇలా జరిగిందని, పేగులకు రక్తప్రసరణ అందకపోవడంతో అక్కడ శరీర కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్‌గా మారిందని వైద్యులు తెలిపారు.

 
పేగుల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని అక్యూట్‌ మెసెంటెరిక్‌ ఇస్కీమియా(ఎఎంఐ)గా వ్యవహరిస్తారు. ముందే గుర్తించకపోతే అది గ్యాంగ్రేన్‌గా మారే ప్రమాదం ఉంది. అప్పుడు కుళ్లిన భాగాన్ని మొత్తం తీయాల్సి ఉంటుంది. నిమ్స్‌ కాకుండా మరో రెండు, మూడు ఆసుపత్రులకూ ఈ తరహా కేసులు వచ్చాయి. కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, నల్లరంగులో విరేచనాలు వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ ఇబ్బంది ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 కోట్లకు ఐపి, పరారీలో కుటుంబం, ఎక్కడంటే?