Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో తెలుగు స్థితిగతులపై అధ్యయనం కోసం ఏపీ శాసనమండలి కమిటీ

Advertiesment
AP Legislative Council Committee
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:37 IST)
తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధి, తెలుగు సంస్కృతి ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మహమ్మద్ అహమద్ షరీఫ్‌ని, కమిటీ సభ్యులుగా శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పివిఎన్. మాధవ్‌ను నియమించారు. 
 
ఈ అధ్యయనంలో భాగంగా చెన్నై వచ్చిన కమిటీ సభ్యులను తమిళనాడు రాష్ట్రంలో గత నలభై సంవత్సరాల నుండి తెలుగు వారి సమస్యలపై అనేక కార్యక్రమాలు చేస్తున్న 'ద్రావిడ దేశం' అధ్యక్షుడు వి .కృష్ణారావుతో పాటు.. చెన్నై మహానగరంలోని ఇతర తెలుగు ప్రముఖులను కలుసుకుని పొరుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారి అనేక సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. 
 
ముఖ్యంగా తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలో విద్యాభ్యాసం కొనసాగించుటకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. తెలుగులో విద్యాభ్యాసం చేసిన తెలుగు విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు తమిళంలో రాయాలని ఇబ్బంది పెడుతున్నారని ఆఖరిక్షణంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తెలుగులో పరీక్షలు రాస్తున్నారని వివరించారు.
 
ఇక్కడ తెలుగు విద్యార్థులకు సకాలంలో తెలుగు పాఠ్య పుస్తకాలు అందించడం లేదని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పాఠ్యపుస్తకాలు ఇక్కడ విద్యార్థులకు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ తెలుగువారికి రాజకీయపరంగా ఎటువంటి అండదండలు లేనందువల్ల ఆ దృష్టిలో కూడా పరిశీలన చేయాలని కోరారు. రాష్ట్రంలోగానీ కేంద్రంలోగానీ మాతృభాషలో విద్యాభ్యాసం కొరకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వాటిని అమలుపరిస్తే చాలని కృష్ణారావు కోరారు. 
 
తమిళ విద్యార్థులు తమ మాతృభాష తమిళంలో చదువుకోటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని అదే సహకారం తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా తెలుగు విద్యార్థులు పొందేటట్లు చొరవ చూపించాలని కోరారు. భాషాపరంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలుగా విడిపోయేందుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం చెన్నై మైలాపూరులో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కోసం తగినంత నిధులు కేటాయింపు కొరకు కూడా ప్రయత్నం చేయాలని కమిటీ సభ్యులకు కృష్ణారావు వినతిపత్రం అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాసన రాజధాని ఏర్పాటు దిశగా చర్యలు