కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కూడా చతికిలపడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో డిసెంబర్ చివరి నాటికి 50 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చనే అంచనాలున్నాయి.
మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెంచడం కోసం మోదీ సర్కార్ 2020 ఏప్రిల్ 1న పీఎల్‌ఐ స్కీమ్ తీసుకువచ్చింది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రో మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 1,100 శాతం పెరుగుదల నమోదైందని చెప్పారు.
దీనివల్ల దేశీ అవసరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఉత్పత్తి చేస్తున్నామని పంకజ్ వివరించారు. డిసెంబర్ నాటికి ప్రత్యేక్షంగానే 50 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ఇకపోతే.. దేశీ, అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు (ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, శాంసంగ్, డిక్సన్, లావా వంటివి) దేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.
ఇంకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్‌టివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశంలో తయారీని పెంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో చాలా మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి.