మధ్యతరగతి ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఇటీవల ఆదాయపన్న పరిమితిని రూ.12 లక్షలకు ఆమాంతం పెంచి మధ్యతరగతికి ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని భావిస్తోంది.
ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా 12 శాతంలో ఉన్న చాలావరకు వస్తువులను 5 శాతం పన్నుల శ్లాబ్ పరిధిలోకి తీసుకురావడమో చేయాలని కేంద్రం చూస్తోంది. తద్వారా వారిపై భారం తగ్గించాలని భావిస్తోందని జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పేద, మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే టూత్ పేస్టులు, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, వంటగదిలో వినియోగించే పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రూ.1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, ఫుట్‌వేర్, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటివి వస్తువులకు జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్న వస్తువుల జాబితాలో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల ఖజానాపై రూ.40 వేల నుంచి రూ.50 వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.