ప్రముఖ చాక్లెట్ల కంపెనీల్లో క్యాడ్‌బరీ ఒకటి. క్యాడ్‌బరీ ఇండియాకు ప్రస్తుతం భారీ షాక్ తగిలింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
అవినీతి, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సంస్థకు చెందిన హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం దీనిని మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుస్తారు.
2009-11 మధ్య క్యాడ్‌బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ.
పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా, మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది.
అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచార అందలేదని సదరు కంపెనీ అధికారులు తెలిపారు.