Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో 2 వారాలు నోట్ల కష్టాలు తప్పవ్... మార్కెట్‌లోకి రూ.500 కొత్త నోట్లు

దేశంలో పెద్ద నోట్ల కష్టాలు మరో రెండు వారాల పాటు ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అదేసమయంలో కొత్త రూ.500 నోట్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి.

Advertiesment
Rs.500 Note Launch
, సోమవారం, 14 నవంబరు 2016 (11:58 IST)
దేశంలో పెద్ద నోట్ల కష్టాలు మరో రెండు వారాల పాటు ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అదేసమయంలో కొత్త రూ.500 నోట్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 
 
దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ చారిత్రక నిర్ణయంతో నల్ల దొంగలు బెంబేలెత్తుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం నానా ఇక్కట్లు పడుతున్నారు. పనులు మానుకుని మరీ, పచ్చ నోటు కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. 
 
గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చుంటున్న వారికి మరో రెండు వారాలు ఈ ఇక్కట్లు తప్పవని కేంద్రం ప్రకటించింది. ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకోగలమని, మరో రెండు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే బ్యాంకు యాజమాన్యాల వాదన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
 
రెండు వారాల్లో పరిస్థితికి అదుపులోకి తేవడం కష్టమని, మరో ఆరు వారాలు పట్టే అవకాశముందని చావు కబురు చల్లగా చెప్పాయి. కొత్త నోట్లు ప్రవేశపెడుతున్నందు వల్ల ఏటీఎంల్లో సరికొత్త టెక్నాలజీని వినియోగించాల్సి వస్తోందని, అందుకే ఇంత ఎక్కువ సమయం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు. ఒక్కో ఏటీఎంను అప్‌డేట్ చేయడానికి దాదాపు 15 నిమిషాలకు పైగా సమయం పడుతోందని తెలిపారు. 
 
ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతానికి 3వేల మంది ఇంజనీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని, మరో వెయ్యి మందికి పైగా అవసరం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, ఏటీఎంల్లో డబ్బు అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు సమయం పట్టే అవకాశముందని బ్యాంకులు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా ఏటీఎంల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు బ్యాంకు యాజమాన్యాలు తెలిపాయి. 
 
ఇదిలావుండగా, పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2 వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో నిన్న కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని నేటి నుంచి బ్యాంకుల్లో పంపిణీ చేయనున్నారు. రూ.500 అందుబాటులోకి వచ్చాక ప్రజల నోట్ల కష్టాలు మరికాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.2 వేల నోట్లను దుకాణాల్లో ఇచ్చినా చిల్లర చెల్లించలేక ఆ నోట్లను ఎవరూ తీసుకోవడం లేదు. రూ.500 అందుబాటులోకి వస్తే లావాదేవీలు మరింత సరళతరమయ్యే అవకాశం ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ నిర్ణయంతో తిరుగుబాటు తప్పదు.. నోట్ల రద్దు దిక్కు మాలిన నిర్ణయం : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు