దేశంలో ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన లక్ష్మీ విలాస్ బ్యాంకు మరోమారు వడ్డీ రేట్లను సవరించింది. అక్టోబరు ఒకటో తేదీ (గురువారం) నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమలుకు వస్తాయని ఆ బ్యాంకు అధికారులు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
డొమెస్టిక్ టర్మ్‌లో 15 రోజుల నుంచి యేడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఒక యేడాది రెండేళ్ళ లోపు, రెండేళ్ళ నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి కలిగిన వడ్డీ రేట్లలో మాత్రం స్వల్పంగా మార్పులు చేసింది.
ఒక యేడాది నుంచి రెండేళ్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెగ్యులర్ కస్టమర్లకు ఇస్తూ వస్తున్న 7.50 శాతం వడ్డీని ఏడు శాతంగా తగ్గించారు. అలాగే, సీనియర్ సిటిజన్స్‌కు 8.25 నుంచి 7.75 శాతానికి తగ్గించారు. ఇకపోతే, రెండేళ్ళ నుంచి మూడేళ్ళ లోపు కాలపరిమితి కలిగిన వడ్డీ రేట్లను 8 శాతం నుంచి 7.75 శాతంగాను, సీనియర్ సిటిజన్స్‌లలో 8.75 శాతం నుంచి 8.50 శాతంగాను తగ్గించినట్టు ఆ బ్యాంకు ఏజీఎం శ్రీనివాసన్ పేర్కొన్నారు.