ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. అయితే, ఇలా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు మన చర్మం మీద ఎక్కువగా కన్పిస్తాయి. ముఖ్యంగా.. పెదవులు పొడిబారి పగిలిపోవడం, వాటినుంచి నెత్తురు రావడం లాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటికి ముగింపు పలకాలంటే కింది విషయాలను గుర్తుంచుకోవాలి.
పెదవులు తేమగా ఉండేందుకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలనేది ప్రాథమికంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది దాహమైతేనే నీరు తాగుతారు. అది మంచిది కాదు. నీటి సీసా పక్కనే ఉంచుకునే తరచూ నోరు తడుపుకోవడం ఈ కాలంలో తప్పనిసరిగా చేసుకోవాల్సిన అలవాటు.
అలాగే గంటకోసారి పెదవులకు లిప్‌బామ్ రాసుకుంటూ ఉండాలి. అందుకే ఇంట్లోనే కాకుండా అదనంగా ఓ లిప్‌బామ్‌ను హ్యాండుబ్యాగులో ఉంచుకోవాలి. దీనివల్ల పెదవులు తేమగా, తాజాగా కనిపిస్తాయి. అలాగే ఎండనుంచి పెదవుల్ని కాపాడుతుంది లిప్‌బామ్.
ఇక లిప్‌స్టిక్ వేసుకునేవారైతే.. అది వేసుకునేందుకు ముందు కొద్దిగా లిప్‌బామ్ తీసుకుని పెదవులకు రాసుకుని, ఆ తర్వాత లిప్‌స్టిక్ వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. లిప్‌స్టిక్ వేసుకునేవారు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దాన్ని తప్పనిసరిగా తొలగించాలి. ఆ తర్వాత పేరిన నెయ్యి పెదవులకు నెమ్మదిగా మర్దన చేసుకుని పడుకోవాలి.