Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంత చిన్న రాష్ట్రానికి గవర్నర్‌గా సుష్మాస్వరాజా? వైసీపీ పని కూడా అయిపోతుంది... ఎవరు?

ఇంత చిన్న రాష్ట్రానికి గవర్నర్‌గా సుష్మాస్వరాజా? వైసీపీ పని కూడా అయిపోతుంది... ఎవరు?
, మంగళవారం, 11 జూన్ 2019 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం కాదని సుష్మాయే స్వయంగా ట్వీటర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో పాత ప్రభుత్వం కొనసాగి.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై.. రెండు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు మెజారిటీ ఓటర్ల మద్దతు దక్కింది. మరోవైపు కేంద్రంలో బీజేపీ కూడా భారీ మెజారిటీతో గెలిచింది.
 
మరోవైపు, ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో బలపడాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ఆకాంక్షను వెలిబుచ్చారు. భవిష్యత్తులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తిరుపతి సభ తర్వాత కొన్ని రోజులకే తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ మార్పు వార్త చక్కర్లు కొట్టింది. జూన్ 10, సోమవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వీరి భేటీతో, గవర్నర్ మార్పు వార్తలు ఊపందుకున్నాయి. ఆ వెంటనే, కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. సుష్మాస్వరాజ్‌కు సుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
 
''బీజేపీ విశిష్ట నేత, నా సోదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా ఆమెకు నా శుభాకాంక్షలు. మీ సుదీర్ఘ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు కలుగుతుంది'' అన్నది హర్షవర్ధన్ ట్వీట్ సారాంశం. హర్షవర్ధన్ ట్వీట్‌తో సుష్మాస్వరాజ్ గవర్నర్ గిరీ ఖరారైనట్లేనని చాలామంది భావించారు. శుభాకాంక్షలు తెలుపుతూ హర్షవర్ధన్ ట్వీట్ చేశారని ఏఎన్ఐ వార్తసంస్థ కూడా తెలిపింది. అలాఅలా గవర్నర్ మార్పు వార్త చక్కర్లు కొడుతుండగా, కేంద్రమంత్రి హర్షవర్ధన్ తను శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ విషయాన్ని కూడా ఏఎన్ఐ వార్తాసంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. అందర్లో కాస్త అయోమయం నెలకొన్న సందర్భంలో సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోమవారం రాత్రి ఆమె ట్వీట్ చేశారు.
 
తొమ్మిదేళ్లుగా ప్రస్తుత గవర్నర్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి గవర్నరుగా నియమితులై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకూ కొనసాగుతున్నారు. 1945లో తమిళనాడులో ఈఎస్ఎల్ నరసింహన్ జన్మించారు. పాఠశాల విద్యలో భాగంగా నరసింహన్ రెండేళ్లపాటు హైదరాబాద్‌లో చదివారు. 1968లో ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐ.పి.ఎస్.గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
 
మొదటగా నంద్యాల, తర్వాత నరసంపేట, ఒంగోల్‌లో కొంతకాలం పనిచేసి 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు వెళ్లారు. 2006 సంవత్సరం వరకూ ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. 2007లో ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా నియమితులైన నరసింహన్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
 
ఇంతకూ.. గవర్నర్ మార్పు అంశానికి తెరపడినట్లేనా?
‘‘నరసింహన్.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా 9 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల గవర్నర్లను మార్చే అంశం చర్చలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన అంశం కాదు. అయితే, నిన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేసిన ట్వీట్ విషయానికి వస్తే, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రభావంతోనే ఆయన ట్వీట్ చేశారని భావిస్తున్నాను. అందుకు సమాచార లోపమే కారణం’’ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బీబీసీతో అన్నారు.
webdunia
 
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘‘సుష్మాస్వరాజ్‌ లాంటి సీనియర్, ఎంతో అనుభవమున్న నేతను ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తారని నేను భావించను. ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండు తెలుగు రాష్ట్రాలకూ గవర్నర్‌గా నియమించవచ్చు. కానీ ఆమె కోసం రాజ్యసభ పదవి కూడా ఎదురుచూస్తోంది. ఆమె సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావించవచ్చు’’ అన్నారు. అసలు గవర్నర్ మార్పు అంశం, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడే వ్యూహంలో భాగం కాదని ఆయన అన్నారు.
 
‘‘గవర్నర్ మార్పు అన్నది పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే తప్ప, దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. గవర్నర్ వ్యవస్థతో బీజేపీ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. పార్టీ నాయకులుగా మేం ఎప్పుడూ గవర్నర్‌ను కలిసింది లేదు. అభివృద్ధితోనే మేం దక్షిణాదిలో పట్టు సాధిస్తాం. రాష్ట్ర విభజనలో మా పాత్ర ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను శిక్షించారేతప్ప, మమ్మల్ని కాదు. 
 
ప్రాంతీయ పార్టీలు ఎక్కువకాలం నిలబడలేవు. ఆధిపత్య పోరులో టీడీపీ పనైపోయింది. ఇందుకు వైకాపా అతీతం కాదు. తమిళనాడులో కూడా కరుణానిధి కుటుంబంలో రాజకీయ విభేదాలు వచ్చాయి కదా.. కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో కూడా దేవెగౌడ, కరుణానిధి, కేసీఆర్ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. ఇందుకు వైఎస్సార్సీపీ అతీతం కాదు. వారసత్వ పార్టీలకు కాలం చెల్లింది. ఇప్పటికే మేం తెలంగాణ, కర్నాటకలో బలపడ్డాం. సో... మేం దక్షిణాదిలో బలపడ్డానికి గవర్నర్లను మార్చాల్సిన అవసరం లేదు’’ అని విష్ణువర్ధన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్, రజనీకాంత్‌ వల్ల తమిళ రాజకీయాల్లో శూన్యత: కట్టప్ప