Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడుగుజాడలు - చరిత్రను మార్చిన మహిళామణులు

Advertiesment
అడుగుజాడలు - చరిత్రను మార్చిన మహిళామణులు
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (18:59 IST)
"మన చారిత్రక మహిళలు" (హమారీ పురాఖిన్) పేరుతో భారతదేశ చరిత్రలో మార్పుకు నాంది పలికిన పది మంది మహిళల గురించి ప్రత్యేక కథనాలను బీబీసీ అందిస్తోంది. భారతదేశంలో 19, 20 శతాబ్దాలలో స్త్రీ స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతూ, వివిధ సాంఘిక సంస్కరణలను చేపట్టి, భావితరాలకు మార్గదర్శకులుగా నిలిచిన పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలు ఇవి.

 
ఈ కార్యక్రమం బీబీసీ న్యూస్ తెలుగులో ‘అడుగుజాడలు - చరిత్రను మార్చిన మహిళామణులు' పేరుతో ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం ప్రతి శని, ఆదివారాల్లో వీడియో రూపంలోనూ, వార్తా కథనాలుగానూ బీబీసీ తెలుగు, బీబీసీ హిందీ, బీబీసీ గుజరాతీ, బీబీసీ మరాఠీ, బీబీసీ పంజాబీ, బీబీసీ తమిళ్ లలో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం పేజీలలో ప్రచురితమవుతోంది.

 
ఇప్పటివరకూ విడుదల అయిన భాగాలను కొన్ని భాషల్లో స్థానిక మీడియాలోనూ, ప్రాంతీయ టీవీ చానళ్లల్లోనూ విస్తృతంగా ప్రచారం చేసారు. బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా మాట్లాడుతూ "మహిళల జీవితాలలో ఎన్నో మార్పులొచ్చాయి.

 
కానీ ఇదంతా ఒక్క రాత్రిలో జరిగినది కాదు. స్త్రీ విముక్తి కోసం ఎంతోమంది మహిళలు పోరాడారు. చాలామంది గురించి మనకు తెలీదు కూడా. మార్పుకు కారణమై, చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోయిన అలాంటి మహిళలను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. దేశంలో వివిధ ప్రాంతాలలో సాంఘిక ఉద్యమాలు చేపట్టిన మహిళలను ఎంపిక చేసుకుని వారి గురించి కథనాలను రూపొందించాం. వీరి గురించి మనందరం కచ్చితంగా తెలుసుకోవాలి" అన్నారు.

 
చరిత్రను మార్చిన మహిళలు-మొదటి సీజన్
* ముత్తు లక్ష్మి రెడ్డి (తమిళ నాడు): దేవదాసీ వ్యవస్థను నిర్మూలించడానికి ఎంతో పాటుపడ్డారు. స్త్రీ కనీస వివాహ వయసును పెంచేందుకు పోరాడారు. వేశ్యా గృహాలను, అనైతికంగా సాగే మహిళల, బాలల రవాణాను అడ్డుకునే చట్టం తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేశారు. అఖిల భారత మహిళల సమావేశానికి అధ్యక్షత వహించారు.

 
* రుకేయా షకావత్ హుస్సేన్ (బెంగాల్): స్త్రీవాది, రచయిత్రి, విద్యావేత్త, రాజకీయరంగంలో యాక్టివిస్ట్. దక్షిణ ఆసియాలో స్త్రీ విముక్తి పోరాటంలో ఆద్యురాలు. ఈమెను మహిళా రాజా రామ్ మోహన్ రాయ్ అని పిలిచేవారు. ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్‌తో పోల్చేవారు.

 
* చంద్రప్రభ సైకియాని (అసోం): అసోంలో స్త్రీవాద ఉద్యమానికి ఆద్యులు. పర్దా పద్ధతినుంచీ స్త్రీల విముక్తికోసం పోరాటం చేసారు. బాలికల చదువుల కోసం కృషి చేస్తూ మహిళా సాధికారత కోసం పోరాడారు. అంతేకాకుండా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

 
* ఇంద్రజీత్ కౌర్ (పంజాబ్): పంజాబ్ విశ్వవిద్యాలయానికి ఎంపికైన మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్స్‌లర్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తొలి మహిళా అధ్యక్షురాలు. దేశ విభజన సమయంలో శరణార్థులకు పునరావాస కేంద్రాన్ని నిర్వహించారు. శరణార్థుల పిల్లలకు పంజాబ్‌లోని, పాటియాలాలో ఒక స్కూలును స్థాపించారు.

 
* కమలాదేవి చటోపాధ్యాయ్ (కర్నాటక): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ. స్వతంత్ర్య భారతదేశంలో హస్తకళలకు, చేనేత వస్త్రాలకు, నాటకాలకు పునరుజ్జీవవనం అందించిన వారిలో ప్రముఖులు. మహిళల అభ్యున్నతికి కృషి చేసారు.

 
* అనసూయ సారాభాయ్ (గుజరాత్): భారతదేశంలో కార్మిక ఉద్యమానికి ఆద్యులు. పేద కార్మికుల ఉన్నతికి, మహిళల శ్రేయస్సు కోసం కృషి చేసారు. 1920లో భారతదేశంలో మొట్టమొదటి వస్త్ర కార్మికుల సంఘాన్ని స్థాపించారు.

 
* రఖ్మాభాయి రౌత్ (మహరాష్ట్ర): ఆధునిక భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు. 1891లో వివాహానికి తగిన వయసు చట్టం (ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్) ప్రవేశపెట్టడానికి రఖ్మాభాయ్ విడాకుల కేసు కీలకమయ్యింది. అప్పట్లో విడాకుల గురించి మాట్లాడిన తొలి మహిళ.

 
* బేగం సుగ్రా హుమాయూన్ మీర్జా (ఆంధ్ర ప్రదేశ్): పరోపకారి, సంఘ సంస్కర్త. ముస్లిం స్త్రీల అభ్యుదయం కోసం పోరాడిన మహిళ. హైదరాబాద్‌లో బుర్ఖా లేకుండా బయటకి వచ్చి ఆ విషయంలో దారిదీపంగా నిలిచిన మహిళ.

 
* ఫాతిమా షైక్ (మహరాష్ట్ర): సంఘ సంస్కర్తలైన జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే నడిపిన పాఠశాలలో పేద పిల్లలకు ముఖ్యంగా బాలికలకు విద్యాబోధన చేసిన మొట్టమొదటి ముస్లిం మహిళ.

 
* జస్టిస్ అన్నా చాందీ (కేరళ): భారతదేశంలో స్త్రీ పురుషల మధ్య వేతనాల్లో వ్యత్యాసం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్ల గురించి గళమెత్తిన మొట్టమొదటి హై కోర్టు మహిళా న్యాయామూర్తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో గేమ్‌ ఛేంజర్‌గా మైక్రో ఏటీఎంగా రపీ పే