Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే, దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్

ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే, దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
, సోమవారం, 24 ఆగస్టు 2020 (15:16 IST)
ఆడపిల్లలను అడుగు బయట పెట్టనివ్వని కాలంలోనే ఆమె దేశంలో తొలి హౌజ్ సర్జన్. మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ముత్తులక్ష్మి రెడ్డి.

 
బహుశా ఈ పేరు నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. చరిత్ర పుస్తకాల్లోనూ పెద్దగా లేకపోవచ్చు. కానీ, 'ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్' అనే పదానికి ముత్తులక్ష్మి రెడ్డి పర్యాయ పదంగా నిలుస్తారు. జులై 30 ముత్తులక్ష్మి రెడ్డి జయంతి.

 
బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే ముత్తులక్ష్మి రెడ్డి. అంతేకాదు దేశంలోనే మొదటి హౌస్ సర్జన్. స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి చైర్‌పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా. ''అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు. మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మీ రెడ్డి.'' అని అంటారు 

 
సరోజిని దేవీ, అనిబిసెంట్‌ల స్ఫూర్తితో..
ఓ దేవదాసి కుటుంబంలో 1886 జులై 30న ముత్తులక్ష్మి రెడ్డి జన్మించారు. ఆమెది మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై ప్రాంతం. తల్లి చంద్రమ్మాళ్ దేవదాసిగా ఎదుర్కొన్న కష్టాలను చూసిన ముత్తులక్ష్మిరెడ్డికి ఎలాగైనా ఈ దురాచారాన్ని రద్దు చేయాలని అనిపించింది. ఇది ఆమె ఆ దిశగా అడుగులు వేసేలా చేసింది.

 
ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మి 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేశారు. 1912లో మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసి దేశంలోనే తొలి హౌజ్ సర్జన్‌గా నిలిచారు. కాలేజీ రోజుల్లో సరోజినాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు ముత్తులక్ష్మి రెడ్డి హాజరయ్యేవారు. అక్కడ మహిళల హక్కులు, వారి సమస్యలపై చర్చించేవారు. అలాగే.. గాంధీజీ, అనిబిసెంట్‌ల ప్రభావం ముత్తులక్ష్మిపై ఎక్కువగా ఉండేది.

 
'దేవదాసి' కూతురుగా పుట్టి ఆ వ్యవస్థే రద్దు చేయించి..
హౌజ్ సర్జన్‌గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అదే సమయంలో విమెన్స్ ఇండియా అసోసియేషన్ (డబ్య్లూఐఏ) అభ్యర్థన మేరకు మళ్లీ భారత్ వచ్చి రాజకీయాల్లో చేరారు. 1926లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అవడంతో దేశంలోనే తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. కొన్నాళ్ల తర్వాత కౌన్సిల్‌కు డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళలు, చిన్నారులు, అనాథల సంక్షేమం కోసం కృషి చేశారు.

 
ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థ రద్దు కోసం పోరాడారు. దేవదాసీ వ్యవస్థ రద్దు కోసం మద్రాసు ప్రెసిడెన్సీలో బిల్లు పాస్ చేయించి చట్టం తీసుకరావడంలో కీలక పాత్ర వహించారు. అంతేకాదు, డాక్టర్‌గా పేద రోగుల కోసం 1954లో అడయార్ క్యాన్సర్ వైద్యశాలను స్థాపించి సేవలందించారు. తన ఆత్మకథ 'మై ఎక్స్‌పీరియన్స్ యాజ్ ఏ లెజిస్లేటర్' పుస్తకంలో మహిళలు, పిల్లల అక్రమరవాణా, బాల్య వివాహాల చట్టం సవరణ, దేవదాసీ వ్యవస్థ రద్దుకు చేసిన కృషిని ఆమె పేర్కొన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైనిక చర్యకు సర్వదా సిద్ధం : చైనాకు భారత్ వార్నింగ్