Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

అమెజాన్ బాస్ జెఫ్‌ బెజోస్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?

Advertiesment
Jeff Bezos hack
, గురువారం, 23 జనవరి 2020 (12:47 IST)
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ అరేబియా యువరాజు హ్యాక్ చేయించారంటూ వచ్చిన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిపుణులు డిమాండ్ చేశారు. అమెరికాలో నివసించే జర్నలిస్టు ఖషోగ్జీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో 2018 అక్టోబరులో హత్య చేశారు.
 
సౌదీకి చెందిన ఖషోగ్జీ... అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆయన హత్యకు సౌదీ యువరాజు బిన్ సల్మాన్ ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఆ హత్య తమ నియంత్రణను ధిక్కరించి భద్రతా బలగాలు చేసిన ఆపరేషన్ అని సౌదీ అరేబియా చెప్తోంది.
 
జెఫ్ బెజోస్ ఫోన్‌కు బిన్ సల్మాన్ వ్యక్తిగత అకౌంట్ నుంచి అనుమానిత వాట్సాప్ లింక్ వచ్చిన తర్వాత... ఆ ఫోన్ హ్యాక్ అయిందని ద గార్డియన్ వార్తాపత్రిక బుధవారం ఒక కథనం ప్రచురించింది. ఖషోగ్జీ హత్యకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసిన వార్తలకు ఈ హ్యాకింగ్‌కు సంబంధం ఉందని గావిన్ డి బెకర్ అనే పరిశోధకుడు గత ఏడాది మార్చిలో చెప్పారు. ఈ వ్యవహారంలో ఎప్పుడు, ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పటివరకూ తెలిసిన వివరాలివీ...
 
2018 మే 1: 'అడగని సందేశం' 
గార్డియన్ పత్రిక కథనం ప్రకారం... ఈ రోజున సౌదీ యువరాజు నుంచి బెజోస్‌ వాట్సాప్ ఖాతాకు.. బెజోస్ అడగకుండానే అది 'స్నేహపూర్వక సందేశం'లా ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన కొన్ని గంటల్లోనే బెజోస్ ఫోన్ నుంచి భారీ మొత్తంలో డాటా బయటకు వెళ్లిపోయిందని ఆ కథనం అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ చెప్తోంది.
 
2018 అక్టోబర్ 2: ఖషోగ్జీ హత్య 
ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి జమాల్ ఖషోగ్జీ వెళ్లారు. టర్కీ మహిళ హాటీస్ చెంగిజ్‌ను వివాహం చేసుకోవటానికి అవసరమైన పత్రాలు తీసుకోవటం కోసం ఆయన ఆ కార్యాలయానికి వెళ్లారు. కానీ, మళ్లీ బయటకు రాలేదు. ఖషోగ్జీ చనిపోయారని సౌదీ అరేబియా అంగీకరించటానికి రెండు వారాలకు పైనే సమయం పట్టింది.
webdunia
 
2018 నంబర్ 16: మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై ఆరోపణలు 
జమాల్ ఖషోగ్జీని హత్య చేయాలని బిన్ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ విశ్వసిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. ఆ హత్యలో సాల్మన్ పాత్ర లేదని సౌదీ అరేబియా వాదించింది.
 
2019 ఫిబ్రవరి 7: బెజోస్ వర్సెస్ టాబ్లాయిడ్ 
అమెరికా కేంద్రంగా నడిచే సౌదీ టాబ్లాయిడ్ 'నేషనల్ ఎంక్వైరర్'.. తనకు తన గర్ల్‌ఫ్రెండ్, ఫాక్స్ టెలివిజన్ మాజీ ప్రెజెంటర్ లారెన్ సాంచెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలను ప్రచురించి.. బ్లాక్‌మెయిల్‌కు, బలవంతపు వసూళ్లకు ప్రయత్నిస్తోందని జెఫ్ బెజోస్ ఆరోపించారు.
 
2019 మార్చి 30: సౌదీ పాత్ర 
వాషింగ్టన్ పోస్ట్ యజమాని ఫోన్‌ను హ్యాక్ చేయటంలో సౌదీ అరేబియా పాత్ర ఉందని పరిశోధకుడు గావిన్ డి బెకర్ అన్నారు. ''బెజోస్ ఫోన్‌ను సౌదీలు హ్యాక్ చేశారని, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని మా పరిశోధకులు, పలువురు నిపుణులు చాలా విశ్వాసంతో నిర్ధారించారు'' అని 'ద డెయిలీ బీస్ట్' వెబ్‌సైట్‌లో డి బెర్ రాశారు.
 
2019 జూన్ 19: 'ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య' 
ఖషోగ్జీ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, యువరాజు బిన్ సల్మాన్ మీద దర్యాప్తు జరపాలని చెబుతూ.. ప్రభుత్వాల చట్టవ్యతిరేక హత్యల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత, ఖషోగ్జీ హత్యపై ఇస్తాంబుల్‌ను సందర్శించిన దర్యాప్తు బృందానికి సారథ్యం వహించిన ఆగ్నస్ కాలమార్డ్ ఒక నివేదిక విడుదల చేశారు.
 
2019 డిసెంబర్ 23: మరణ శిక్షలు 
ఖషోగ్జీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియాలోని ఒక కోర్టు.. ఐదుగురు వ్యక్తులకు మరణ శిక్ష, మరో ముగ్గురికి జైలుశిక్ష విధించింది. ''ఆ హత్యకు ఆదేశించిన వారు స్వేచ్ఛగా సంచరిస్తుండటమే కాదు.. దర్యాప్తు కానీ, విచారణ కానీ వారిని కనీసం తాక లేదు'' అని ఐక్యరాజ్యసమితి దూత అన్నారు.
webdunia
 
2020 జనవరి 21: 'అసంబద్ధ' వాదనలు 
జమాల్ ఖషోగ్జీ హత్యకు ఐదు నెలల ముందు వాషింగ్టన్ పోస్ట్ యజమాని బెజోస్‌కు బిన్ సల్మాన్ అకౌంట్ నుంచి కోరని సందేశాన్ని పంపించారని.. గార్డియన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. బెజోస్ ఫోన్ నుంచి ఏం తీసుకున్నారు, దానిని ఎలా ఉపయోగించుకున్నారు అనేది తమకు తెలియదని ఆ పత్రిక చెప్పింది. ఈ ఆరోపణలు 'అసంబద్ధ'మైనవని అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం అభివర్ణించింది.
 
ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు కూడా అయిన జెఫ్ బెజోస్‌కు.. ఖషోగ్జీ హత్య జరగటానికి ముందు బిన్ సల్మాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు, సౌదీ అరేబియాలో వ్యాపార ప్రయోజనాలు ఉండేవి. అయితే.. ఆ హత్యకు సంబంధించిన కథనాలను ప్రచురించటంలో, సౌదీ అరేబియాను తీవ్రంగా ఖండించటంలో బెజోస్ తన పత్రికకు మద్దతుగా నిలవటంతో ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి.
 
ఓస్లోలో నివసించే అరబ్ రచయిత, ఉద్యమకారుడు ఐయాద్ ఎల్-బాగ్దాదీ.. జమాల్ ఖషోగ్జీ స్నేహితుడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేయటం.. రియాద్‌ పాలకులను విమర్శించే వారికి 'ఒక సందేశం' ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ''భూమి మీద అత్యంత సంపన్నుడైన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోగలరు.. బ్లాక్‌మెయిల్ కూడా చేయగలరు.. మరి ఇంకెవరు భద్రంగా ఉంటారు?'' అని ఆయన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసిన ఒక కథనంలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది?