Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతుల నిరసనలు: రైతు సంఘాల లోపల ఏం జరుగుతోంది... వారి వ్యూహాలు ఎలా ఉన్నాయి?

రైతుల నిరసనలు: రైతు సంఘాల లోపల ఏం జరుగుతోంది... వారి వ్యూహాలు ఎలా ఉన్నాయి?
, బుధవారం, 9 డిశెంబరు 2020 (14:24 IST)
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే నిరసనలు ఆపుతామని డిసెంబరు 5న ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వం కాస్త ముందుకు వచ్చి, చట్టాల్లో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, చట్టాలను రద్దు చేస్తామని మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు.

 
ఈ నిరసనలను 30కి పైగా రైతు సంఘాలు ముందుండి నడిపిస్తున్నాయి. ప్రతిష్టంభనను తొలగించడమే లక్ష్యంగా మంగళవారం రాత్రి ఈ సంఘాల ప్రతినిధులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే, ఇవి కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు నొక్కిచెబుతున్నాయి. అయితే, బ్యాక్ చానెల్ ద్వారా సంప్రదింపులకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 
రోజూ ఉదయం 10 గంటలకు...
దిల్లీ సరిహద్దుల్లో రోజూ ఉదయం 10 గంటలకు రైతు సంఘాల నాయకులు భేటీ అవుతున్నారు. మరోవైపు సాయంత్రం కూడా సమీక్ష చేపడుతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా చూసుకునేందుకే వారు ఈ రెండు సమావేశాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏం జరుగుతుందో అందరికీ తెలియజేయడమే ఈ సమావేశాల లక్ష్యం.

 
పంజాబ్‌కు చెందిన 31 రైతు సంఘాలు ఈ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్నాయి. చాలా రైతు సంఘాలు వీరికి మద్దతు ప్రకటించాయి. నిరసనల్లో పాల్గొంటున్న 31 సంఘాలు ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఇలాంటి మిగతా రెండు సమాఖ్యలు కూడా చట్టాలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మొదటగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని రైతు సంఘాలు ఏకం అయ్యాయి. ఆ తర్వాత మిగతా సంఘాలూ క్రమంగా సంఘీభావం ప్రకటించాయి. అన్ని వర్గాల నుంచి గట్టి మద్దతు వస్తున్న నేపథ్యంలో, రైతు సంఘాలు పట్టుదలతో ఉన్నాయి.

 
వెనక్కి తగ్గేది లేదు...
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో మోహరించిన రైతుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందినవారే. రైతు సంఘాలు కూడా పంజాబ్‌కు చెందినవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకుంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే భయం రైతు సంఘాల నాయకుల్లోనూ కనిపిస్తోంది. ‘‘చట్టాల్లో సవరణకు సరేనని కొంతమంది నాయకులు అంగీకారం తెలిపారు. కానీ మేం ఒప్పుకోలేదు’’అని భారతీయ కిసాన్ మంచ్ ఏక్తాకు చెందిన బూటా సింగ్ చెప్పారు.

 
‘‘కొన్ని సంఘాల నాయకులు మన కొంచెం తగ్గి మెతవైఖరిని అనురించాలని సూచించారు. కానీ మేం తిరస్కరించాం’’అని కీర్తి కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర సింగ్ కూడా వివరించారు. ‘‘ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను సంఘాల నాయకులు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను ముందుకు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే’’అని ఆయన అన్నారు.

 
ఈ నిరసనల కోసం పంజాబ్‌లోని రైతు సంఘాలు నాలుగు నెలల నుంచీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నిరసనలు చేపట్టేందుకు అనువైన సమయాన్ని ఎంచుకున్నాయి. ఇప్పుటికే గోధుమ, వరి పంటల నూర్పిడి మొదలైంది. దీంతో తదుపరి కొన్ని నెలల వరకు వారికి ఎక్కువ పనేమీ ఉండదు. కాబట్టి వచ్చే మార్చి వరకు ఈ ఉద్యమాన్ని వారు హాయిగా నడిపించగలుగుతారు.

 
దిల్లీకి చేరుకున్న రైతులు తమకు కావాల్సిన సరకులు, సదుపాయాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే పంజాబ్‌, దిల్లీల్లోని గురుద్వారాలు వీరి కోసం లంగర్‌లు నడపిస్తున్నాయి. పౌర హక్కుల సంస్థలూ తమకు చేతనైన సాయం చేస్తున్నాయి. మరోవైపు నిరసనల కోసం ఎన్‌ఆర్‌ఐలు కూడా పెద్ద మొత్తంలో నిధులు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెనకడుకు వేసేందుకు రైతు సంఘాలు అసలు మొగ్గుచూపడం లేదు.

 
రైతుల ఉనికికే ముప్పు
‘‘ఇది కేవలం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఇది ఆహార భద్రత కోసం జరుగుతున్న పోరాటం. ఈ చట్టాలతో రైతుల ఉనికికే ముప్పు. కార్పొరేట్ల కోసం ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది. వీటిని మేం ఎలాగైనా అడ్డుకుంటాం. మా భూముల్లో కార్పొరేట్లను అడుగుపెట్టనివ్వం’’అని భారత కిసాన్ సంఘ్ ఉగరాహా గ్రూప్‌కు చెందిన జోగీందర్ సింగ్ అన్నారు.

 
ఈ చట్టాల్లో లోపాలు ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిందని, ఇలాంటి చట్టాలను అమలు చేయనివ్వమని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాటం కోసం సిద్ధమయ్యే అందరమూ వచ్చామని భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన జగ్‌జీత్ సంగ్ దాలేవాల్ అన్నారు. ‘‘మాతో వచ్చిన అందరూ మానసికంగా సిద్ధమయ్యే వచ్చారు. మేం వెనకడుగు వేసేది లేదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోదని మా అందరికీ తెలుసు. ప్రభుత్వం ఒప్పుకోనంత వరకు మేం వెనక్కి వెళ్లం. కచ్చితంగా చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అదే మా డిమాండ్. ఈ విషయంలో వెనక్కి తగ్గం’’అని ఆయన వివరించారు.

 
ఇది కేవలం రైతుల సమస్య కాదు
మూడో రోజు నిరసనల సమయంలో బురారీ మైదాన్ వరకు పాదయాత్ర చేయాలని కిసాన్ సంఘర్ష్ సమితి నాయకుడు, స్వరాజ్ ఇండియా కన్వీనర్ యోగేంద్ర యాదవ్ భావించారు. అయితే ఈ యాత్రను అడ్డుకున్నారు. ‘‘ఇది కేవలం కేవలం రైతుల సమస్య మాత్రమే కాదని రైతు సంఘాల నాయకులు అర్థం చేసుకుంటున్నారు. ఇదొక ప్రజా ఉద్యమంలా మారుతోంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నిరసనలు జరుగుతున్నాయి. అందుకే ఇతర సంఘాలు కూడా మాతో చేతులు కలుపుతున్నాయి’’ అని కీర్తి కిసాన్ యూనియన్‌కు చెందిన రాజీందర్ సింగ్ చెప్పారు.

 
‘‘ఈ చట్టాలను దేశం మొత్తం అమలు చేయాలని భావిస్తున్నారు. ఇవి కేవలం పంజాబ్‌కు మాత్రమే పరిమితం కావు. ఒంటరిగా పోరాడితే ప్రభుత్వం తలవంచదని మేం భావించాం. అందుకే కలిసికట్టుగా ముందుకు వచ్చాం. మిగతా సంఘాలు కూడా ఇప్పుడు మాతో కలుస్తున్నాయి’’అని రాజీందర్ అన్నారు. అందరు నాయకులూ ఒకేమాటపై ఉండాలి, అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై తాము చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు భారతీయ కిసాన్ మంచ్‌కు చెందిన బూటా సింగ్ వ్యాఖ్యానించారు.

 
‘‘మా అంతర్గత సమావేశాల్లో చాలా అంశాలు చర్చించుకుంటాం. కానీ ఒకటి మాత్రం సుస్పష్టం. ఆ చట్టాలు రద్దుచేస్తేనే మేం నిరసనలు ఆపుతాం’’అని ఆయన అన్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రైతు సంఘం నాయకుడు రాకేశ్ సింగ్ టికైట్ కూడా ఘాజీపుర్ సరిహద్దుల్లో నిరసన చేపడుతున్నారు. ఆయన ఇదివరకు ఎలాంటి నిరసనల్లోనూ పాలుపంచుకోలేదు. అయితే, పంజాబ్, హరియాణా రైతుల్ని సరిహద్దుల్లో అడ్డుకోవడంతో ఆయన కూడా నిరసనకు దిగారు.

 
‘‘సింఘు సరిహద్దుల్లో సమావేశం కోసం మా రైతు సంఘానికి ఆహ్వానం పంపించారు. దూరంగా ఉండటంతో నేను వెళ్లలేకపోయాను. కానీ, మా ప్రతినిధులు పాల్గొన్నారు’’అని ఆయన చెప్పారు. అయితే, రాకేశ్ ద్వారా కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని ఆయన తోసిపుచ్చారు. రాకేశ్ రైతు సంఘానికి చెందిన కొందరి ఇళ్లలో యూపీ పోలీసులు సోదాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేమీ లేదని ఆయన తోసిపుచ్చారు. నిరసనలు పూర్తయ్యేవరకు తను ఘాజీపుర్ సరిహద్దుల్లోనే ఉంటానని అన్నారు.

 
మరోవైపు సోషల్ మీడియాలోనూ క్రియాశీలంగా ఉండటంపై రైతు సంఘాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వంతో క్రియాశీలంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ... అన్ని సంఘాలు ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని ముక్త కంఠంతో చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద పులుల ఆహారం కోసం కవ్వాల్‌ అడవిలో వదిలిన వందలాది జింకలు ఏమయ్యాయి? - ప్రెస్ రివ్యూ