Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వ్యాక్సీన్: 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఉచితం కాదు: ప్రెస్ రివ్యూ

Advertiesment
Covid Vaccine
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:14 IST)
దేశంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వేసే టీకా ఉచితం కాదని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది. మే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వీరికీ ఇప్పటిలాగే ఉచితంగా వ్యాక్సీన్‌ అందుతుందేమోనని అందరూ భావించారు. కానీ ప్రభుత్వ ప్రకటనను తరిచిచూస్తే అందులో ఉన్న గూడార్థం బోధపడుతుంది.

 
18 ఏళ్లపైబడిన వారు వ్యాక్సీన్‌ వేయించుకోవాలంటే బహిరంగ మార్కెట్లో కొనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనేది ఆ ప్రకటన సారాంశం అని ఈనాడు చెప్పింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కేంద్రీకృతంగా జరుగుతున్న వ్యాక్సీన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం కొంతమేర తప్పుకొంది.

 
50% భారాన్ని తాను తీసుకొని మిగిలిన 50% భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టేసింది. దీనివల్ల తమ రాష్ట్ర పరిధిలోని ప్రజల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యతను ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మోయాల్సి ఉంటుంది. ''కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇదివరకటిలాగానే కొనసాగుతుంది, వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లపైబడిన వారికే ఉచితంగా టీకా అందిస్తాం'' అని కేంద్రం సోమవారం జారీచేసిన ప్రకటనలో పేర్కొంది.

 
18 ఏళ్లపైబడిన వారందర్నీ కేంద్రం అర్హులుగా ప్రకటించింది తప్పితే వారందరికీ ఉచితంగా వ్యాక్సీన్‌ అందిస్తానని చెప్పలేదని పత్రిక రాసింది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది. వ్యాక్సీన్‌ సంస్థలకు మార్కెట్‌ను తెరవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటన వల్ల రాష్ట్రాల్లో ప్రజలు తమకు టీకా ఇవ్వాలని స్థానిక యంత్రాంగాలపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.

 
అప్పుడు రాష్ట్రాలు సొంత డబ్బుపెట్టి వ్యాక్సీన్‌ కొనాల్సి వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. టీకా ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిలో 50% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు ముందుగా నిర్ధారించిన ధర ప్రకారం విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అందులో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి, బహిరంగ మార్కెట్‌కు ఎంత సరఫరా చేయాలన్న స్పష్టమైన లక్ష్మణ రేఖలు గీయలేదు. అందువల్ల అందుబాటులో ఉండే ఆ 50% కోసం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్‌ సంస్థలు పోటీపడితే ధరలు పెరిగిపోయి సామాన్యుడు కొనలేని స్థితి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని ఈనాడు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలోని కోవిడ్‌ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు: ‘వార్డు లోపల ఎవరూ లేరు, రాత్రిపూట వార్డ్‌బాయ్‌ కూడా కనిపించలేదు’