Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్

చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్
, బుధవారం, 4 డిశెంబరు 2019 (12:09 IST)
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. అయితే, దర్యాప్తు సంస్థ అడిగినప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

 
సాక్ష్యాలను మార్చొద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయోద్దని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరం ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మీడియాతో మాట్లాడొద్దని తెలిపింది.
 
 
అసలు ఏమిటీ కేసు?
మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్‌కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన 'ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ)' ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు.
 
 
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?
ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా, ఐఎన్‌ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు.

 
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10 రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది.

 
ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి 4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఈ బోర్డు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్‌ఎక్స్ న్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. బోర్డు సిఫార్సుతో ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

 
అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్‌ఎక్స్ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఐఎన్‌ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు.

 
4 కోట్ల 62 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతివ్వగా 305 కోట్లకుపైగా విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది.

 
చిదంబరం పేరు ఎలా వచ్చింది?
ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో 2008 ఫిబ్రవరిలో దీనిపై వివరణ ఇవ్వాలని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఎఫ్ఐపీబీని కోరారు. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖకు ఎఫ్ఐపీబీ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లేఖ రాసింది.

 
ఎఫ్ఐపీబీ నుంచి లేఖ అందుకున్న ఐఎన్ఎక్స్ మీడియా దీన్నుంచి తప్పించుకునేందుకు కార్తీ చిదంబరంతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. కార్తీ చిదంబరం అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు. చెస్ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రమోటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తే పని సాఫీగా సాగుతుందని ఆ సంస్థ భావించిందని సీబీఐ పేర్కొంది.

 
ఆ తర్వాత చెస్‌ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ సూచించినట్లుగా ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీకి లేఖ రాసింది. అన్ని వ్యవహారాలు సక్రమంగానే జరిగాయంటూ వివరణ ఇచ్చింది. కార్తీ చిదంబరం ఒత్తిడితో ఈ కేసును ఎఫ్ఐపీబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోకపోగా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నించారు. ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలోకి ఇదివరకే వచ్చిన డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి కోసం కొత్తగా ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులు చెప్పినట్లు ఐఎన్ఎక్స్ మీడియా అప్లికేషన్ పెట్టడం, ఎఫ్ఐపీబీ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ వివాదం నుంచి బయటపడేసినందుకు కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కి ఐఎన్ఎక్స్ మీడియా డబ్బులు చెల్లించినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లీబిడ్డను చంపేసి తగలబెట్టిన దుండగులు