Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెస్: ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద‌పై మాగ్నస్ కార్ల్సన్‌ విజయం.. రన్నరప్‌గా నిలిచిన చెన్నై కుర్రాడు

chess
, గురువారం, 24 ఆగస్టు 2023 (20:10 IST)
చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో తమిళనాడుకు చెందిన గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు (ఆర్) ప్రజ్ఞానంద‌పై ప్రపంచ నంబర్. 1 మాగ్నస్ కార్ల్సన్‌‌ విజయం సాధించారు. గురువారం జరిగిన టై బ్రైకర్‌లో మొదటి గేమ్‌లో కార్ల్సన్ గెలవగా, రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కార్ల్సన్‌ విజేతగా అవతరించారు. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు, ఫైనల్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్, బుధవారం జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగియడంతో విజేతను తేల్చేందుకు టై బ్రేకర్ గేమ్‌లు నిర్వహించారు.
 
ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్(ఫిడే) ప్రపంచ కప్ నిర్వహిస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన రెండో భారతీయ ఆటగాడు ప్రజ్ఞానంద. ఇంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే భారత్ నుంచి ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడారు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్ ఆడినవారిలో అత్యంత పిన్న వయస్కుడు ప్రజ్ఞానందే. ఈ నెల ప్రారంభంలోనే ఆయనకు 18 ఏళ్లు నిండాయి. వచ్చే ఏడాది జరగబోయే ‘కేండిడేట్స్ టోర్నీ’కి కూడా ప్రజ్ఞానంద అర్హత సాధించాడు.
 
ఈ టోర్నీకి అర్హత సాధించినవారిలో మూడో అత్యంత పిన్నవయస్కుడు ప్రజ్ఞానంద. ఆయన కంటే ముందు మాగ్నస్ కార్ల్సన్, అమెరికా చెస్ దిగ్గజం బాబీ షిషర్ పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ టోర్నీకి అర్హత సాధించారు.
 
ఎవరీ ప్రజ్ఞానంద?
ప్రజ్ఞానంద స్వస్థలం తమిళనాడులోని చెన్నై. తండ్రి రమేశ్ బాబు తమిళనాడు ప్రభుత్వ సహకార బ్యాంకులో పనిచేస్తారు. పోలియో కారణంగా వైకల్యానికి గురైన తండ్రి రమేశ్ బాబు, ఆది నుంచి ప్రజ్ఞానందకు పూర్తి ప్రోత్సాహం అందించారు. ప్రజ్ఞానంద చెస్ టోర్నీలకు వెళ్లినప్పుడు ఆయన వెంట తల్లి నాగలక్ష్మి, అక్క వైశాలి వెళ్తుంటారు. తన ఆర్థిక పరిస్థితి అనుకూలించక ప్రజ్ఞానందను చెస్‌లోకి పంపించకూడదని అనుకున్నానని, కానీ, అతడిలో ఆసక్తి, ప్రతిభను గమనించాక పూర్తి ప్రోత్సాహం అందించామని తండ్రి రమేశ్ చెప్పారు.
 
''వైశాలి పాఠశాల రోజుల్లో చెస్ తరగతులకు వెళ్లేది. తను చాలా బాగా ఆడుతుంది. ఈ ఆటలో ఉన్నత స్థాయికి చేరుకొనే క్రమంలో, సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆర్థిక పరిమితుల వల్ల నా కొడుకును చెస్ క్లాసులకు పంపొద్దని మొదట్లో అనుకున్నాను. అయితే నాలుగేళ్ల వయసు నుంచే ప్రజ్ఞానంద చెస్ బోర్డు ముందు, తన అక్కతో చెస్ ఆడుతూ చాలా సమయం గడిపేవాడు. తన వయసు పిల్లలతో ఇతర ఆటలు ఆడుకోవడం కంటే చెస్‌పై ప్రజ్ఞానంద చూపే అమితాసక్తిని గమనించి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను’’ అని రమేశ్ బాబు చెప్పారు.
 
‘‘ప్రజ్ఞానంద కన్నా వైశాలి నాలుగేళ్లు పెద్దదని, అక్క నుంచే అతడు చదరంగం ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాడు. ప్రజ్ఞానంద తన అక్కను ఓడించాలని చెస్ ఆడటం నేర్చుకున్నాడు’’ అని 2018లో ప్రజ్ఞానంద గ్రాండ్‌మాస్టర్ అయిన తరువాత ‘బీబీసీ తమిళ్’తో మాట్లాడుతూ రమేశ్ చెప్పారు. 
 
పన్నెండేళ్లకే గ్రాండ్ మాస్టర్
ప్రగ్ అని పిలుచుకునే ప్రజ్ఞానంద తన 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు. ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడు ఆయనే. అక్కడికి రెండేళ్ల తరువాత 2018లో ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినవారిలో రెండో అత్యంత పిన్న వయస్కుడు ఆయన. 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో ఆయన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అత్యంత పిన్నవయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ఘనత యుక్రెయిన్ ఆటగాడు సెర్గీ కర్జాకిన్ పేరిట ఉంది. ఆయన 2002లో తనకు 12 ఏళ్ల 7 నెలల వయసు ఉన్నప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.
 
వరదలలో కొట్టుకుపోయిన ప్రజ్ఞానంద, వైశాలి ట్రోఫీలు
ప్రజ్ఞానంద కుటుంబం చెన్నై శివార్లలో నివసిస్తుంది. ప్రజ్ఞానంద, ఆయన అక్క వైశాలిలు సాధించిన చెస్ ట్రోఫీలు వాళ్ల ఇంట్లో చాలా ఉన్నాయి. 2015లో చెన్నైను ముంచెత్తిన వరదల కారణంగా ఇంట్లోని చాలా ట్రోఫీలు నీళ్లలో కొట్టుకుపోయాయని ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు చెప్పారు.
 
మిడిల్ గేమ్, ఎండ్ గేమ్‌లలో సిద్ధహస్తుడు
ప్రజ్ఞానంద ఆటలో ప్రత్యేకత గురించి ఆయన తండ్రి రమేశ్ 2018లో ‘బీబీసీ’తో చెప్పారు. క్రికెట్‌లో మాదిరే చెస్‌లోనూ ప్రారంభ దశ(ఓపెనింగ్), మధ్య దశ(మిడిల్), చివరి దశ(ఫినిషింగ్) అని మూడు దశలు ఉంటాయని, అందులో మధ్య దశ, చివరి దశ ఆటలో ప్రజ్ఞానంద సిద్ధహస్తుడని రమేశ్ చెప్పారు. ఆట ప్రారంభంలోనూ ఆయన మంచి ప్రతిభే కనబరుస్తారని, కానీ రెండు, మూడు దశల్లో మరింత ప్రతిభ చూపుతారని ఆయన వివరించారు.
 
కార్ల్సన్‌తో పోటీపై ప్రజ్ఞానంద ఏమన్నారు?
ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడుతున్న తరుణంలో ఇండియన్ చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ Xలో (ట్విటర్‌లో) ఒక పోస్ట్ పెట్టారు. ‘వాట్ ఏ పర్ఫార్మెన్స్’ అంటూ ప్రజ్ఞానంద ఆటను ఆయన మెచ్చుకున్నారు. మాజీ ప్రపంచ చాంపియన్లు సుసాన్ పోల్గార్, గారీ కాస్పరోవ్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజ్ఞానందకు అభినందనలు తెలిపారు. ఫైనల్‌కు చేరడంపై ప్రజ్ఞానంద స్పందిస్తూ- ఈ టోర్నీలో కార్ల్సన్‌తో ఆడుతానని తాను అనుకోలేదని, ఆయనతో ఆడాలంటే ఫైనల్‌కు చేరడం ఒక్కటే మార్గమని, కానీ తాను ఫైనల్‌కు చేరుతానని అనుకోలేదని చెప్పారు. ఫైనల్‌లో తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తానని, చివరకు ఏమవుతుందో చూడాలని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయులు ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి సాఫ్ట్ స్కిల్స్-AI సామర్ధ్యం అత్యంత కీలకం: లింక్డ్ఇన్